రోడ్డు నిర్మించాలంటూ గ్రామస్తుల ఆందోళన
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:38 AM
అంగర గ్రామంలో ఓఎన్జీసీకి వెళ్లే రహదారిని నిర్మించాలంటూ ఆ ప్రాంతవాసులు బుధవారం ఓఎన్జీసీ వాహనాలను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
కపిలేశ్వరపురం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అంగర గ్రామంలో ఓఎన్జీసీకి వెళ్లే రహదారిని నిర్మించాలంటూ ఆ ప్రాంతవాసులు బుధవారం ఓఎన్జీసీ వాహనాలను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన పలువురు నాయకులు, మహిళలు మాట్లాడుతూ 4 బావులతో ఓఎన్జీసీ సంస్థ కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. అప్పటి నుంచి అధ్వానంగా మారిన రోడ్డును నిర్మించకుండా కాలయాపన చేస్తున్నారని గ్రామానికి చెందిన షేక్ కరీం, పెద్దింశెట్టి సాయికృష్ణ, మట్టా ఏడుకొండలు, ఉండమట్ల వెంకటేశ్వరరావు, మోర్త గనికమ్మ, మన్ని ఉమామహేశ్వరి, మందపల్లి శేషగిరి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ సామగ్రితో వాహనాలు తిరగడం వల్ల రోడ్డు ఛిద్రంగా మారిందని వారు ఆరోపించారు. ఓఎన్జీసీ వాహనాలను నిలిపివేసి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. సంస్థ ప్రతినిధులు మనోహర్ తదితరులు వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పినప్పటికి ఆందోళన విరమించలేదు. రోడ్డు పైనే వంటా వార్పు జరిపి ఆందోళన కొనసాగించారు. అంగర ఎస్‌ఐ రవికుమార్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనలో యర్రంశెట్టి నాగేశ్వరరావు, కందుకూరి సత్యం, చాపల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 01:38 AM