అత్యాధునిక సౌకర్యాలతో రైతు బజార్
ABN, Publish Date - Jan 24 , 2025 | 12:22 AM
అమలాపురం రైతు బజార్ ఈ నెల 25న పునఃప్రారంభించనున్న దృష్ట్యా రైతుబజార్‌లోని దుకాణ సముదాయాన్ని జాయింట్ కలెక్టర్ నిషాంతితో కలిసి కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతుబజార్ ప్రాంగణ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ఆయా శాఖల సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అమలాపురం రూరల్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అమలాపురం రైతు బజార్ ఈ నెల 25న పునఃప్రారంభించనున్న దృష్ట్యా రైతుబజార్‌లోని దుకాణ సముదాయాన్ని జాయింట్ కలెక్టర్ నిషాంతితో కలిసి కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతుబజార్ ప్రాంగణ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ఆయా శాఖల సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతు బజార్ ఎదురుగా, పక్కన ఉన్న భూములు ఎవరివని అడిగి తెలుసుకున్నారు. అమలాపురంలో రైతు బజార్‌ను అత్యాధునికంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా మెయిన్‌రోడ్డు నుంచి రైతు బజార్‌కు ఉన్న రోడ్లు, డ్రైన్లను వెంటనే ఆధునికీకరించాలన్నారు. టాయిలెట్స్ సదుపాయం కల్పించాలన్నారు. ప్రస్తుతం దుకాణ సముదాయంలో 74 షాపులు ఉండగా 60 షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించినట్టు ఉద్యానవన శాఖ జిల్లా అధికారి బీవీ రమణ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. లంక ప్రాంతాల నుంచి కూరగాయలను తరలించేందుకు ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తిని ఆయన ఆదేశించారు.
25న రైతుబజార్ పునఃప్రారంభం..
మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న రైతు బజార్‌ను పునఃప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా వాణిజ్య, వ్యవసాయశాఖ మార్కెటింగ్ అధికారి కేఏస్వీ విశాలాక్షి తెలిపారు. రైతుబజార్‌లోని అధికారుల కార్యాలయాలకు రంగులు వేయడం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రైతు బజార్‌ను ప్రారంభిస్తామన్నారు. రైతు బజార్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆర్డీవో కొత్త మాధవి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు, తహశీల్దార్ పలివెల అశోక్‌ప్రసాద్, ఎంపీడీవో ఉండ్రు బాబ్జిరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 24 , 2025 | 12:22 AM