7 నుంచి కోనసీమ క్రీడోత్సవం
ABN, Publish Date - Jan 03 , 2025 | 01:06 AM
ఈ నెల 7 నుంచి కోనసీమ క్రీడోత్సవం పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
అమలాపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 7 నుంచి కోనసీమ క్రీడోత్సవం పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండల, జిల్లా స్థాయిల్లో క్రీడోత్సవం నిర్వహించాలన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రాథమిక స్థాయిలో అథ్లెటిక్స్ ఈవెంట్స్‌తో నిర్వహించి విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేయాలన్నారు. అదే విధంగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల స్థాయిలో అథ్లెటిక్స్ పోటీలతో పాటు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు, బాలికల కోసం బ్యాడ్మింటన్ పోటీలు మండల స్థాయిలో నిర్వహించాలన్నారు. మండల స్థాయి విజేతలకు ఈ నెల 22, 23 తేదీల్లో అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందించాలన్నారు. జిల్లాస్థాయి క్రీడా పోటీల అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో క్రీడా పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు ఆట స్థలాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ డీఈ పీఎస్ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. మండలస్థాయి క్రీడా పోటీలకు మండల విద్యాశాఖాధికారి, ఎంపీడీవో, వ్యాయామ ఉపాధ్యాయులతో ఆర్గనైజింగ్ కమిటీ నియమిస్తామని చెప్పారు. మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఈవెంట్ నిర్వహణలో కీలక భూమిక పోషించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 22 ఆటస్థలాల వద్ద ప్రాథమిక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానాలను సిద్ధం చేయడంతో పాటు క్రీడా ఎక్విప్‌మెంట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాఠశాలల యాజమాన్యాల సహకారంతో జిల్లా విద్యాశాఖ క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పించాలన్నారు. జిల్లా ప్రాధికార సంస్థ అధికారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి సమన్వయంతో క్రీడాకారులకు టెంట్‌లు, కుర్చీలు, తాగునీరు, వసతులు తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. మొత్తం ప్రక్రియను జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకుడు పీఎస్ సురేష్‌కుమార్, కలెక్టరేట్ ఏవో కడలి కాశీవిశ్వేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గణేష్, తోట రవి, రమణారావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 01:06 AM