వేలల్లో కోళ్లు మృత్యువాత
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:08 AM
గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కోళ్లు మరణిస్తూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే మరో రెండు వేల కోళ్లు మృత్యువా త పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్క ఫారంలోనే 4,500 కోళ్లు మరణించాయి.
ఇప్పటివరకూ మరణించినవి 4,500 కోళ్లు
బర్ట్‌ఫ్లూగా అనుమానం.. పరిశీలించిన పశుసంవర్థకశాఖ జేడీ
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 17(ఆంధ్ర జ్యోతి): గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కోళ్లు మరణిస్తూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే మరో రెండు వేల కోళ్లు మృత్యువా త పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్క ఫారంలోనే 4,500 కోళ్లు మరణించాయి. ఇవి బర్డ్‌ఫ్లూ కారణంగానే చనిపోయినట్టు భావిస్తున్నారు. చెందుర్తిలోని పుష్కర కాలువ గట్లపై ఉన్న బోనబోయిన కృష్ణకు చెందిన కోళ్ల ఫారంలో ఐబీ కంపెనీకి చెందిన 8 వేల కోళ్లను బ్యాచ్‌లుగా పెంచుతున్నారు. ఇందులో 1500 కోళ్లు శని, ఆదివారాల్లో చనిపోగా, సోమవా రం ఒక్కరోజే 2వేల కోళ్లు మరణించాయి. అంతకుముందు మరో వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. భారీ స్థాయిలో కోళ్లు చనిపోతుండడంతో ఇవి బర్డ్‌ఫ్లూ కారణంగానే చనిపోతున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే తూ ర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాం తాల్లో బర్డ్‌ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు మరణించాయి. ఇదే రీతిలో ఇక్కడ మరణాలు సంభవిస్తున్నా ఇప్పటివరకూ అధి కారులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కాగా చెందుర్తి కోళ్లఫారంను జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాశరావు సోమవారం పరిశీలించారు. కోళ్ల మరణాలకు గల కారణాలపై ఆరా తీశారు. అసాధారణ వ్యాధి కారణంగా కోళ్లు చనిపోతున్నాయని, ఇవి ఇతర కోళ్లకు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన బయో సెక్యూరిటీ చర్యల గురించి వివరించినట్టు జేడీ తెలిపా రు. చనిపోయిన కోళ్లను ప్రజాసంచారానికి దూరంగా గొయ్యి తీసి సున్నం, బ్లీచింగ్ వేసి పూడ్చి పెట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ మరణాల గురించి ఎటువంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉడికించిన మాంసం, కోడిగుడ్లు తినవచ్చని, వాటివల్ల ఎలాంటి అనారోగ్యం కలుగదని తెలిపారు. ఆయన వెంట గొల్లప్రోలు ఏరియా ప్రభుత్వ వైద్యశాల ఏడీ డాక్టర్ శ్రీని వాసరావు, పశువైద్యాధికారి డాక్టర్ హిమజ తదితరులు ఉన్నారు
భోపాల్‌కు నమూనాలు
చనిపోయిన కోళ్ల నుంచి కాకినాడ ఏడీడీ ఎల్ ల్యాబ్ అధికారులు శాంపిల్స్ సేకరించా రు. వీటిని భోపాల్‌కు పరీక్షలు నిమిత్తం ఒక పశువైద్యాధికారితో పంపుతున్నట్టు పశుసంవర్థకశాఖ అధికారులు తెలిపారు. అక్కడ నుంచి నివేదిక కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వస్తుందని చెప్పారు. ఆ తర్వాతే అసలు వ్యాధి నిర్థారణ అవుతుందని స్పష్టంచేశారు.
Updated Date - Feb 18 , 2025 | 01:08 AM