అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యం తగదు
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:14 AM
అర్జీల పరిష్కారంలో బాధ్యతా రాహిత్యానికి తావు లేకుండా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.
అమలాపురం టౌన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అర్జీల పరిష్కారంలో బాధ్యతా రాహిత్యానికి తావు లేకుండా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్ రాజకుమారి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, ఎస్‌డీసీ కృష్ణమూర్తి అర్జీదారుల నుంచి 199 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు మండల, వార్డు స్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. మండల స్థాయిలో మీ కోసం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ డివిజన్, జిల్లా స్థాయిల్లో అర్జీదారుల తాకిడిని తగ్గించాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల గురించి అర్జీదారులు జిల్లా కార్యాలయానికి వస్తున్నారని, దీని వల్ల ప్రజలకు డబ్బు, సమయం వృథా అవుతున్నాయన్నారు. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. మండల, పురపాలక సంఘాల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లాస్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో సమర్పించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 12:14 AM