అంతర్వేది కల్యాణోత్సవాలపై సమీక్ష
ABN, Publish Date - Jan 24 , 2025 | 12:24 AM
ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమలాపురం టౌన్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్‌కుమార్ మాట్లాడుతూ స్వామివారి తిరు కల్యాణోత్సవం, రథోత్సవం, స్వామివారి చక్రస్నానం, హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాలకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. దేవదాయ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా పారిశుధ్యం, తాగునీరు, టాయిలెట్లు, పార్కింగ్, రవాణా, భక్తుల దర్శనం తదితర ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. మెరైన్, సివిల్ పోలీసులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పంచాయతీరాజ్ శాఖ ఆద్వర్యంలో ఎక్కడికక్కడ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణోత్సవాల్లో దుకాణాల్లో కల్తీ పదార్థాలు విక్రయించకుండా తూనికలు, కొలతలు, ఫుడ్ క్వాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతీరోజు ఉత్సవ ఈవెంట్లు నిర్వహించిన తీరు వివరాలను ఆర్డీవో కె.మాధవి అదేరోజు సాయంత్రం మీడియాకు వివరిస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ కొత్తపేట ఆర్డీవో పర్యవేక్షించాలన్నారు. ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ దేవస్థానంలోను, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ బీచ్ వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ అధికారులు ఉత్సవ నిర్వహణ తీరు పట్ల తమకున్న సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకుని సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు పి.శ్రీకర్, డి.అఖిల, కె.మాధవి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 24 , 2025 | 12:24 AM