ప్రతి భక్తునికి కల్యాణం చూసే భాగ్యం కల్పించాలి
ABN, Publish Date - Feb 05 , 2025 | 12:41 AM
దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని అమలాపురం ఆర్డీవో కె.మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మంగళవారం చంద్రప్రభ, సూర్యవాహనాల గ్రామోత్సవాలు జరిగాయని, భక్తుల కోర్కెలు తీర్చే శ్రీకరుడు, సర్వశుభాలను ఇచ్చే శుభకరుడు లక్ష్మీనరసింహస్వామి ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యేకంగా ఉన్న అంతర్వేది మహాపుణ్యక్షేత్రంలో ఉత్సవాలు ప్రారంభించామన్నారు.
అంతర్వేది, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని అమలాపురం ఆర్డీవో కె.మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మంగళవారం చంద్రప్రభ, సూర్యవాహనాల గ్రామోత్సవాలు జరిగాయని, భక్తుల కోర్కెలు తీర్చే శ్రీకరుడు, సర్వశుభాలను ఇచ్చే శుభకరుడు లక్ష్మీనరసింహస్వామి ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యేకంగా ఉన్న అంతర్వేది మహాపుణ్యక్షేత్రంలో ఉత్సవాలు ప్రారంభించామన్నారు. 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నాలుగు దఫాలుగా సమీక్షా సమావేశాలను వివిధ శాఖల అధికారులతో నిర్వహించామన్నారు. అంతర్వేది పుణ్యక్షేత్రానికి సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. 1600 మంది పోలీసులను శాంతిభద్రతల పరిరక్షణకు, 270 మందిని పారిశుధ్య నిర్వహణకు, మొత్తం 1800 మందిని మూడు షిఫ్ట్‌లలో విధుల నిర్వహణకు కేటాయించినట్లు చెప్పారు. రెవెన్యూ, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల్లో ఉన్న ఉద్యోగులకు విధుల బాధ్యత అప్పగించినట్లు చెప్పారు. 120 మొబైల్ టాయిలెట్లను భక్తుల కోసం ఏర్పాటు చేశామన్నారు. 50 సత్రాల్లో భక్తులకు ఉచిత అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి కల్యాణోత్సవాలను తిలకించేందుకు సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తూ 1500 టిక్కెట్లు కేటాయించినట్లు చెప్పారు. కల్యాణోత్సవాల టిక్కెట్లను 7వ తేదీ ఉదయం ఆలయం వద్ద కౌంటర్‌లో విక్రయిస్తారన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం, తాగునీరు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూము నుంచి ఉత్సవాల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. మంగళవారం సాయంత్రం ఉండపల్లి, బెల్లంకొండ కుటుంబ సభ్యుల సంయుక్త నిర్వహణలో స్వామి-అమ్మవార్లను పెండికుమారుడు, పెండ్లికుమార్తెలను చేసే తంతు జరిగిందన్నారు. ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, చైర్మన్, ఫ్యామిలీ ఫౌండర్ రాజాకలిదింది కుమారరాజగోపాలరాజాబహుదూర్, ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ, తహశీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్ భాస్కర్, ముప్పర్తి నాని, గుబ్బల ఫణికుమార్, సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Feb 05 , 2025 | 12:41 AM