ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం

ABN, Publish Date - Feb 02 , 2025 | 01:16 AM

బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఘటనా స్థలం పరిశీలించి వివరాలు తెలుసుకున్న కమిషన్‌

బైరాగిపట్టెడ పద్మావతీ పార్కు వద్ద తొక్కిసలాట వివరాలను తెలుసుకుంటున్న జస్టిస్‌ సత్యనారాయణమూర్తి

తిరుపతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో గత నెల 8వ తేదీన వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా భక్తులు గాయపడి, ఆరుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు న్యాయ విచారణ ప్రారంభమైంది. విచారణ కమిషన్‌గా నియమితులైన ఏపీ హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

న్యాయ విచారణ కమిషన్‌ జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. పద్మావతీ అతిధి గృహంలో బస చేసిన ఆయన శనివారం ఉదయం తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి కలెక్టరేట్‌ చేరుకున్నారు. కలెక్టరేట్‌లోని నాలుగో అంతస్తులో 413వ నంబరు గదిని విచారణ కమిషన్‌ కార్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించింది. అక్కడికి చేరుకున్న సత్యనారాయణమూర్తి తొలుత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే వివిధ విభాగాల నుంచీ ప్రభుత్వానికి అందిన నివేదికలతో కూడిన సమాచారాన్ని ప్రాధమికంగా పరిశీలించారు. ఆపై విచారణకు పిలవాల్సిన అధికారులు, ఉద్యోగులు, ఇతర వ్యక్తుల జాబితా రూపొందించుకున్నారు. విచారణకు హాజరు కావాల్సిందిగా వారికి సమన్లు, నోటీసులు సిద్ధం చేయించారు. సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌లోని కార్యాలయం నుంచీ బయల్దేరి తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగిపట్టెడ పద్మావతీ పార్కు వద్దకు చేరుకున్నారు.

తొక్కిసలాట ఘటన వివరాల సేకరణ

పద్మావతీ పార్కు చేరుకున్న జస్టిస్‌ సత్యనారాయణమూర్తి తొలుత తొక్కిసలాట జరిగిన ప్రధాన గేటును, పక్కనే వున్న చిన్న గేటును పరిశీలించారు. పార్కులోకి భక్తుల రాకపోకలకు వీలు కల్పించే గేట్లు ఇవేనా? పెద్దగేటును, చిన్న గేటును ఏయే సందర్భాల్లో వినియోగిస్తారు? అని సిబ్బందిని ప్రశ్నించారు. తిరుపతి అర్బన్‌ మండల సర్వేయర్‌ జగదీష్‌తో రెండు గేట్లు ఎంత వెడల్పు వున్నదీ కొలతలు తీయించారు. గత నెల 8వ తేదీన భక్తులు పార్కులోకి ఏ గేటు ద్వారా వెళ్ళారు? వెలుపలికి ఏ గేటు ద్వారా వచ్చారు? అలాగే పార్కు నుంచీ టోకెన్లు జారీ చేసే కౌంటర్లకు ఎలా వెళ్ళారు? అని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పార్కు మెయిన్‌ గేటు నుంచీ పక్కనే వున్న రామానాయుడు మున్సిపల్‌ హైస్కూలు వరకు బ్యారికేడ్ల ఏర్పాటు ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరించారు. పార్కు నుంచీ స్కూలు వరకూ ఐదు అడుగుల వెడల్పుతో రెండు క్యూ లైన్లు, స్కూలు వద్ద నుంచీ కౌంటర్ల వరకూ మాత్రం ఐదు అడుగుల వెడల్పుతో ఒకే క్యూ లైన్‌ ఏర్పాటు చేసిన సంగతి నమోదు చేసుకున్నారు.కౌంటర్లకు ఒకే క్యూ లైన్‌ ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. అయితే తొక్కిసలాట జరిగింది స్కూల్లో కాదని, పార్కు మెయిన్‌ గేటు వద్ద అని జస్టిస్‌ సత్యనారాయణమూర్తికి సిబ్బంది తెలియజేశారు. అనంతరం మెయిన్‌ గేటు వద్దనుంచీ నడుచుకుంటూ ఆయన రామానాయుడు స్కూలు మైదానంలోకి వెళ్ళారు. టోకెన్లు తీసుకున్న భక్తులు స్కూలు ఆవరణ నుంచీ వెలుపలికి వెళ్ళే మార్గం గురించి ఆరా తీశారు. పార్కు మెయిన్‌ గేటు నుంచీ స్కూలు వరకూ ఏర్పాటు చేసిన క్యూలైన్ల కొలతలు, అలాగే స్కూల్లో మైదానం పొడవు, వెడల్పుతో కూడిన స్కెచ్‌లు సిద్ధం చేసి తనకు వెంటనే అందజేయాలని అధికారులను సత్యనారాయణమూర్తి ఆదేశించారు. అనంతరం ఘటనా స్థలం నుంచీ పద్మావతీ అతిధి గృహానికి బయల్దేరి వెళ్ళారు.

అధికారులకు దూరంగా...

శుక్రవారం రాత్రి తిరుపతి వచ్చిన జస్టిస్‌ సత్యనారాయణమూర్తి అధికారులకు దూరంగా వున్నారు. శుక్రవారం రాత్రి పద్మావతీ అతిధి గృహం వద్ద కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో జిల్లా రెవిన్యూ అధికారి నరసింహులు ఆయనకు స్వాగతం పలికారు. అది మినహా మరెక్కడా మరే ఇతర అధికారులూ ఆయనను కలిసే ప్రయత్నం చేయలేదు. కలెక్టరేట్‌లో తనకు కేటాయించిన కార్యాలయం వద్ద కూడా ఆయన మీడియాను కలిసేందుకు కూడా అంగీకరించలేదు. కేవలం బాధ్యతలు చేపట్టే సందర్భంలో ఫొటోలు తీసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఆ సందర్భంగా విచారణ వ్యవధి, ప్రక్రియలపై వివరాలు అడిగినా ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో సైతం ఇతర అధికారుల రాకపోకలు కనిపించలేదు. కేవలం తనకు కేటాయించిన సిబ్బందితోనే అవసరమైన సమాచారం విశ్లేషించడం, సమన్లు, నోటీసులు తయారు చేయడం చేశారు.అంతేకాకుండా ఘటనా స్థలాన్ని సందర్శించినపుడు కూడా ఆయన వెంట కార్యాలయ సిబ్బంది మినహా పోలీసు, రెవిన్యూ, టీటీడీ, టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగాలకు చెందిన అధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. గాలేరు-నగరి భూసేకరణ విభాగం రెండవ యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.సుధారాణిని ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌కు కార్యదర్శిగా నియమించింది.అలాగే ఓ డిప్యూటీ తహసిల్దార్‌ను లైజన్‌ ఆఫీసర్‌గా, రెవిన్యూ శాఖకే చెందిన కింది స్థాయి ఉద్యోగిని స్టెనో కమ్‌ టైపిస్టుగా నియమించింది.

న్యాయ విచారణ మొదలు కావడంతో అధికారుల్లో గుబులు

తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ అభ్యర్థనతో న్యాయ విచారణ ప్రారంభం కావడంతో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు, ఘటన జరిగిన రోజు సంబంధిత ప్రదేశంలో విధుల్లో వున్న అధికారులు, ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం పోలీసు, నిఘా వర్గాల ద్వారా ఆ రోజు ఏం జరిగింది? ఎవరు ఎంతవరకూ బాధ్యులు, కారకులు? అన్న దానిపై విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకుంది. ఘటన జరిగిన మరుసటి రోజున ప్రాధమిక సమాచారంతోనే బైరాగిపట్టెడ కేంద్రం వద్ద విధుల్లో వున్న డీఎస్పీ రమణకుమార్‌, టీటీడీ గోశాల డైరెక్టర్‌ హరినాధరెడ్డి సస్పెన్షన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా అక్కడ విధుల్లో లేకపోయినా మొత్తంమీద పర్యవేక్షణా బాధ్యత కలిగిన ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ సీవోఎస్వో శ్రీధర్‌ నిర్వక్ష్యంగా వ్యవహరించారన్న అభిప్రాయంతో వారిని బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు తిరుపతి వచ్చి వెళ్ళాక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో విచారణ చేయించి ఘటనకు కారణాలు, అధికారుల వైఫల్యాలపై సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు. అయినా సంతృప్తి చెందని ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించారు. ఏపీ హైకోర్టు రిటైర్డు జడ్జి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, నిఘా విభాగం అధికారులు, టీటీడీ అధికారులు, రెవిన్యూ అధికారులతో విచారణలు జరిపితే ఏదో ఒక స్థాయిలో బాధ్యులను, కారకులను తప్పించే ప్రయత్నాలు జరిగే అవకాశాలను కొట్టిపారవేయలేని పరిస్థితి. అయితే హైకోర్టు రిటైర్డు జడ్జితో న్యాయ విచారణ మొదలు కావడం, కమిషన్‌ అధికారులను దూరంగా పెట్టడంతో తొక్కిసలాట ఘటన జరిగిన రోజున విధుల్లో వున్న అధికారులు, ఉద్యోగుల్లో కలవరపాటు మొదలవుతోంది. మొత్తంగా పర్యవేక్షణ బాధ్యత కలిగిన పై స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించామన్న ఆరోపణలను ఎదుర్కొనాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Feb 02 , 2025 | 01:16 AM