కార్పొరేటర్లు వెళ్లే బస్సుకు భద్రత కల్పించండి
ABN, Publish Date - Feb 04 , 2025 | 01:48 AM
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ, జిల్లా ఎస్పీని ఆదేశించాలని కోరుతూ వైసీపీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి, 40వ వార్డు కార్పొరేటర్ టి.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తిరుపతి ఎస్పీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ, జిల్లా ఎస్పీని ఆదేశించాలని కోరుతూ వైసీపీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి, 40వ వార్డు కార్పొరేటర్ టి.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్ధించారు. పిటిషన్‌ను లంచ్‌మోషన్‌గా స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత.. ఎస్వీయూలోని సెనేట్ హాల్‌కు వెళ్లేందుకు కార్పొరేటర్లు వినియోగించే బస్సుకు పోలీసు భద్రత కల్పించాలని ఎస్పీని ఆదేశించారు. భద్రత కల్పించాలని కోరుతూ ఎస్పీకి సమర్పించే వినతిపై ఆ బస్సులో ప్రయాణించే కార్పొరేటర్ల సంతకాలు ఉండాలని స్పష్టం చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... డిప్యూటీ మేయర్ ఎన్నికకు వెళ్లే సమయంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడే ప్రమాదం ఉందన్నారు.
కార్పొరేటర్లకు కునుకేదీ?
డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్పొరేటర్లకు కునుకులేకుండా చేస్తోంది. ముఖ్యంగా కొత్త మహిళా కార్పొరేటర్లు అసహనంగా నలిగిపోతున్నారు. క్యాంపు రాజకీయాల్లో భాగంగా పలు చోట్ల హోటళ్లలో బస చేస్తున్న చోట్లకు అటు కూటమి.. ఇటు వైసీపీ నేతలు పోటాపోటీగా చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ వారిని నిద్రలేపి చిన్నపిల్లలున్నా పట్టించుకోకుండా నానా యాగీ చేశారు. సోమవారం ఎన్నికకు ముగింపు కార్డు పడుతుందనుకునేలోపు మళ్లీ వాయిదాపడడంతో వీరంతా నోరెళ్లబెట్టారు. మళ్లీ ఎవరి దారిన వారు క్యాంపులకు పయనమయ్యారు.
Updated Date - Feb 04 , 2025 | 01:48 AM