తిరుపతిలో పొలిటికల్ హైడ్రామా
ABN, Publish Date - Feb 02 , 2025 | 01:11 AM
డిప్యూటీ మేయర్ ఎన్నికతో అనూహ్య పరిణామాలు వైసీపీ కార్పొరేటర్ల క్యాంపులు, కూటమి నేతల చర్చలు అక్రమ నిర్మాణాలపై కార్పొరేషన్ కొరడా కూటమి చెంతకు శేఖర్ రెడ్డి నేడు టీడీపీ కండువా కప్పుకునే అవకాశం వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని ప్రకటించిన భూమన
తిరుపతి, ఫిబ్రవరి1(ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో శనివారం తిరుపతి పొలిటికల్ హైడ్రామాకు వేదికైంది. వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్‌గా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 20 మంది కార్పొరేటర్లతో వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. శేఖర్ రెడ్డి నేతృత్వంలో క్యాంపు రాజకీయాల్లో ఆరితేరిన వారిని రంగంలోకి దింపి తమిళనాడు రిసార్ట్స్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంతలో ఊహించని పరిణామాలు తిరుపతిలో చోటు చేసుకున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతికి చేరుకుని డిప్యూటీ మేయర్ ఎన్నికపై కూటమి నేతలలో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగర పాలకసంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించడంతో రాజకీయ రగడ మొదలైంది. ముఖ్యంగా శేఖర్ రెడ్డి ఆస్తులపై ఫోకస్ పెట్టడంతో వైసీపీ శ్రేణులు కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఏమైందో శేఖర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ సీనియర్ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి సమక్షంలో కూటమి పెద్దలతో మంతనాలు జరిగినట్టు తెలిసింది. ఆదివారం శేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. కాగా, శనివారం సాయంత్రం వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకుల చర్యలను తప్పుబట్టారు. మరో వైసీపీ కార్పొరేటర్ లడ్డూ భాస్కరరెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. తమ హయాంలో ఇలాంటి కుట్రపూరిత పనులు చేయలేదని, ఎవరిమీదా కేసులు పెట్టలేదని చెప్పుకొచ్చారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల సమయంలో టీడీపీకి చెందిన ఆర్పీ శ్రీనివాసులు తన భార్య కార్పొరేటర్‌గా పోటీ చేస్తుందన్న కారణంగా అతని జీవనాధారమైన టీషాపును తొలిగించిన ఘటనను పలువురు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. ఇదిలా వుండగా కూటమి పార్టీ నుంచి అభ్యర్థిపై కసరత్తు జరుగుతోంది. టీడీపీ నుంచి గెలిచిన ఒకే ఒక కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, అసమ్మతి కార్పొరేటర్లను కూటమి వైపునకు తీసుకొచ్చేందుకు కృషిచేసిన నరసింహాచారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈనెల 3న జరగబోయే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఇంకెన్ని విచిత్రమైన పరిణాలు చోటుచేసుకుంటాయో చూడాల్సి ఉంది.
Updated Date - Feb 02 , 2025 | 01:11 AM