ప్చ్.. పచ్చిమిర్చి
ABN, Publish Date - Mar 03 , 2025 | 01:34 AM
పచ్చి మిరప.. పంట చేతికొచ్చేసరికి ధరల ఘాటు తగ్గింది. పెట్టుబడి కూడా రాని పరిస్థితి తలెత్తింది.
పచ్చి మిరప.. పంట చేతికొచ్చేసరికి ధరల ఘాటు తగ్గింది. పెట్టుబడి కూడా రాని పరిస్థితి తలెత్తింది. సముద్రతీర ప్రాంత మండలాలైన కోట, వాకాడు, చిట్టమూరులలో ఈ ఏడాది నేలబావులు, ఫిల్టర్‌పాయింట్లు, చెరువుల కింద రైతులు మిరప సాగు చేపట్టారు. మరోవైపు సీజన్‌లో వర్షాలు లేకపోవడం, నవంబరు నుంచి డిసెంబరు వరకు వరదలు ముంచెత్తడంతో వరి, వేరుశనగ, చెరకు పంటలను సాగుచేయలేక సూళ్లూరుపేట, నాయుడుపేట వ్యవసాయ సబ్ డివిజన్లలోని ఎక్కువమంది రైతులు పచ్చిమిర్చి వైపు దృష్టి పెట్టారు. దీంతో ఒకప్పుడు మెట్ట ప్రాంతాలకే పరిమితమైన మిర్చిని ఈ ప్రాంతాల్లోనూ దాదాపు 10 వేల ఎకరాలకుపైగా సాగు చేశారు. సూళ్లూరుపేట ప్రాంతంలోని మంగళంపాడు, మతకాముడి, ఉగ్గుముడి, సుగ్గుపల్లి, మంగానెల్లూరు, దామానెల్లూరు, వెలగలపొన్నూరు, ఉచ్చూరు ప్రాంతాల్లో విస్తృతంగా మిరప సాగు చేపట్టారు. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకున్నారు. గతేడాదికంటే ఈసారి పచ్చిమిరప కాయలు ఎక్కువ దిగుబడి వచ్చాయి. అదే సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు కుమిలిపోతున్నారు. సూళ్లూరుపేట ప్రాంతంలో రైతులు మేలురకం మిరప జాతులైన ఇండాం-5, ఇండాం-67, ప్రియాంక, వజ్ర, నాందారి, సున్నా-56, జేకే రకాలను సాగు చేసి.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేవారు. దీంతో ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయాన్ని పొందేవారు. ఇప్పుడు దిగుబడుల వేళ కిలో రూ.13 నుంచి రూ.15 మధ్యలో ధర పలకడంతో నష్టపోతున్నారు. గతేడాది అక్టోబరులో కిలో మిర్చి రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలికేది. గతేడాఇ ఇదే సీజన్‌లో కిలో రూ.40 నుంచి 60 వరకు కూడా పలికింది. పండు మిర్చి కూడా ఒకప్పుడు కిలో రూ.220 ఉండగా నేడు రూ.100 నుంచి రూ.120కి పడిపోయింది.
తప్పని నష్టం
ఎకరా మిర్చి సాగుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మిర్చి ధర మార్కెట్‌లో టన్ను రూ.10 వేల నుంచి రూ.13 వేలు మాత్రమే పలుకుతోంది. ఎకరాకు 5 టన్నుల దిగుబడి వచ్చినా నష్టం చవిచూడక తప్పడం లేదు. అధిక పెట్టుబడులు పెట్టి ఏపుగా పంటను పండించిన రైతులు నేడు ధరలు పడిపోవడంతో నష్టాలకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, కోట ప్రాంతంలో ఎక్కవగా కౌలు రైతులు ఒక్కో ఎకరాన్ని సీజన్‌ను బట్టి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు తీజుకు తీసుకుని మిరపసాఆగు చేపట్టారు. పెట్టుబడులు, లీజులుకూడా రాకపోవడంతో (ధరలపరంగా) వీరంతా లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఆయా మండలాలలో పచ్చి మిరపకాయలను అమ్ముకొని చివరితడిలో పండు మిరపకాయలుగా ఎండబెట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
- కోట/సూళ్లూరుపేట, ఆంరఽధజ్యోతి
Updated Date - Mar 03 , 2025 | 01:34 AM