స్తంభించిన డీసీసీబీ సేవలు
ABN, Publish Date - Mar 04 , 2025 | 02:06 AM
అన్నదాతలకు ‘సహకారం’ అందించాల్సిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి.ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని సింగిల్ విండోల్లో సీఈవోలు, సిబ్బంది కంప్యూటరైజేషన్‌పై దృష్టిపెట్టి, రుణాల పంపిణీని నిర్లక్ష్యం చేస్తున్నారు.
కంప్యూటరీకరణ పేరిట దాటవేత
ఎల్టీ రుణవితరణ లక్ష్యం రూ.300 కోట్లు.. ఇచ్చింది రూ.8 కోట్లే
కౌలు రైతులకు పైసా విదల్చని బ్యాంకు
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు ‘సహకారం’ అందించాల్సిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి.ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని సింగిల్ విండోల్లో సీఈవోలు, సిబ్బంది కంప్యూటరైజేషన్‌పై దృష్టిపెట్టి, రుణాల పంపిణీని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో స్థానిక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాగా బ్యాంకు బ్రాంచ్‌ల్లో అంతోఇంతో రుణాలిస్తున్నా బకాయిల వసూలు అంతంతమాత్రంగానే వుంది. ఫలితంగా నిరర్ధక ఆస్తులు రూ.వంద కోట్లకుపైగా పేరుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.940 కోట్లు స్వల్పకాలిక, దీర్ఘకాలిక, కౌలురైతులకు రుణాలివ్వాలని లక్ష్యం కాగా, ఫిబ్రవరి చివరినాటికి రూ.528 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. మార్చినెలాఖరు నాటికి మిగిలిన రూ. 412కోట్లు పంపిణీ సాధ్యమా...? 40 శాతానికి పైగా రికవరీ వున్న సంఘాలకే దీర్ఘకాలిక రుణాల కేటాయింపులు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.3500 కోట్ల టర్నోవర్ అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫడిపాజిట్ల లక్ష్యం నెరవేరేనా?
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1100 కోట్లు డిపాజిట్లు సేకరించాలన్నది లక్ష్యం. ఫిబ్రవరి చివరినాటికి రూ.940 కోట్ల మేర సేకరించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెలాఖరులోగా మిగిలిన రూ.160 కోట్లు సేకరించాల్సి వుంది.
ఫ దీర్ఘకాలికం కొందరికే
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 75 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు), 37 బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా దీర్ఘకాలిక రుణాలు రూ.300 కోట్లు వితరణ చేయాలన్నది లక్ష్యం కాగా, 2025 ఫిబ్రవరి ఆఖరి నాటికి ఇచ్చింది 180 మంది రైతులకు అక్షరాలా రూ.8 కోట్లు మాత్రమే.
ఫ పంటరుణాల పంపిణీ మెరుగే
ఖరీఫ్,రబీసీజన్లకు సంబంధించి సన్న,చిన్నకారు రైతులకు సహకార బ్యాంకుద్వారా రూ.600కోట్లు పంపిణీ చేయాల్సి వుండగా బ్యాంకు అధికారులు రూ.520కోట్లు పంపిణీచేసి శభాష్ అనిపించుకున్నారు.
ఫ కౌలుదారులకు గుండుసున్న
సాగు ధ్రువీకరణ హక్కు పత్రాలు (సీసీఆర్సీ) కలిగిన కౌలు రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా పంట రుణాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు కౌలురైతులు సీసీఆర్సీ పత్రాలు కూడా పంపిణీ చేశారు. ప్రస్తుత ఏడాది 40 కోట్ల రూపాయల దాకా కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వాలని డీసీసీబీ లక్ష్యం పెట్టుకుంది.అయితే ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం విడ్డూరం.
ఫ బకాయిల వసూలు కష్టమే!
ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్రబ్యాంకు పరిధిలో 75 సింగిల్ విండోల కంప్యూటరీకరణ పనులు వంద రోజులుగా సాగుతూ.. వున్నాయి. అసలు ఎంతమందికి రుణాలిచ్చారో అన్న వివరాలతో పాటు అప్పుల వివరాలు, డిపాజిట్లు, మూలధనం చెల్లించినవారు.. తదితర వివరాలన్నిటినీ.. కంప్యూటరీకరిస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 2 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని నేటికీ నత్తనడకన సాగుతుండడం గమనార్హం. కంప్యూటరీకరణ పేరుతో బ్యాంకుల్లో, సింగిల్ విండోల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.పనిచేయాల్సిన సీఈవోలు, సిబ్బంది కంప్యూటరీకరణ ప్రక్రియలో మునిగిపోవడంతో రుణాల పంపిణీ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. రూ.103 కోట్ల వరకు వున్న పారుబాకీలను 65 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి ఆఖరుకు రూ.40 కోట్లు వసూలు చేయాలని బ్యాంకు అధికారులు లక్ష్యం నిర్ణయించారు. గత మూడు నెలలుగా మొండి బకాయిల వసూలు కోసం దృష్టిపెట్టాల్సిన యంత్రాంగం కంప్యూటరీకరణ ప్రక్రియపై దృష్టిమరల్చడంతో మొండిబకాయిల వసూళ్ళు ఆగిపోయాయి. ఫిబ్రవరి, మార్చినెలల్లో మొండిబకాయిల వసూళ్ళకు బ్యాంకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బ్యాంకుల వద్ద ఎన్పీఏ రికవరి డ్రైవ్ పేరిట బ్యానర్లు కట్టి అధికారులు మొండిబకాయిలు వసూలు చేపట్టారు.అయినా పెద్దగా ఫలితం లేదు.
వివరాలు ఇలా....
డీసీసీ బ్యాంకు బ్రాంచ్‌లు : 37
సింగిల్ విండోలు : 75
ఎల్టీ రుణ లక్ష్యం : రూ.300 కోట్లు
180 మందికి ఇచ్చింది : రూ.8 కోట్లు
ఎస్టీ రుణలక్ష్యం : రూ.600 కోట్లు
64వేలమందికి ఇచ్చింది రూ.520 కోట్లు
కౌలు రైతులకు రుణలక్ష్యం : రూ.40 కోట్లు
పంపిణీ చేసింది : నిల్
మొత్తం రుణాల పంపిణీ లక్ష్యం : రూ.940 కోట్లు
గత నెల వరకు ఇచ్చింది : రూ.528 కోట్లు
ఈ నెలాఖరులోగా ఇవ్వాల్సింది : రూ.412 కోట్లు
Updated Date - Mar 04 , 2025 | 02:06 AM