టెన్త్ పరీక్షల్లో పొరబాట్లు జరిగితే క్రిమినల్ కేసులు
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:58 AM
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకుంటే కారకులపై క్రిమినల్ కేసులు పెడతామని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ హెచ్చరించారు.
ఓపెన్ పరీక్షలు సవాల్‌గా మారాయన్న ఆర్జేడీ శామ్యూల్
చిత్తూరు సెంట్రల్, మార్చి 7(ఆంధ్రజ్యోతి):టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకుంటే కారకులపై క్రిమినల్ కేసులు పెడతామని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, సెంటర్, స్టోరేజ్ పాయింట్ కస్టోడియన్స్‌కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ఏ పొరబాటు చోటు చేసుకున్నా అందుకు చీఫ్ డిపార్టుమెంటల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సెంటర్లలో ఛీఫ్ మినహా, నాన్ టీచింగ్, ఇతరులెవరైనా అజమాయిషీ చేయడానికి ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.సెంటర్‌లో ఉన్నవారికి ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని, లేని అటెండర్‌ను సైతం కేంద్రానికి దూరంగా ఉంచాలన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైనా, సిబ్బంది మాత్రం 8 గంటలకే విధుల్లో ఉండాలన్నారు. 8.30 గంటల తర్వాతే పోలీసు స్టేషన్ నుంచి బండిళ్ళు తీసుకోని పరిశీలన చేసుకోవాలన్నారు. 9.15 గంటలకు మాత్రమే సెంటర్‌లో బండిళ్ళు తెరవాలన్నారు. నాలుగు అడుగుల డెస్క్‌లో ఒక్క విద్యార్థి మాత్రమే ఉండాలని, ఎక్కడైనా ఇద్దరు కూర్చున్నట్లు గుర్తిస్తే, సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలతో పాటు 17 నుంచి నిర్వహించే టెన్త్ ఓపెన్ పరీక్షల నిర్వహణ విద్యాశాఖకు సవాలుగా మారిందన్నారు.విద్యార్థులను పాస్ చేయిస్తామంటూ కొంతమంది పరీక్షా కేంద్రాల కోఆర్డినేటర్లు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.వాటిని పలువురికి పంచి, అడ్డదారులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారన్నారు.అయితే అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షల నియమావళిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.డీఈవో వరలక్ష్మి, పరీక్షల సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, డీవైఈవోలు బాలాజీ, ప్రభాకర్, సీఎస్, సీడీలు, పరీక్ష విధులకు హాజరయ్యే టీచర్లు పాల్గొన్నారు. అంతకు ముందు డీఈవో కార్యాలయంలో టీచర్ల సీనియారిటీ జాబితా తయారీలో పురోగతిపై ఆయా సెక్షన్ల సిబ్బందితో సమీక్షించారు.
నేడూ రేపు అభ్యంతరాల స్వీకరణ
టీచర్ల సీనియారిటీ జాబితాలోని అభ్యంతరాలను సెలవు రోజులైన శని, ఆదివారాల్లోనూ డీఈవో కార్యాలయంలో స్వీకరించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. కాగా జాబితా తయారీలో చోటు చేసుకున్న తప్పులను సవరించాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు ఆర్జేడీ శామ్యూల్‌కు వినతి పత్రం అందించారు.
Updated Date - Mar 08 , 2025 | 01:58 AM