రుయాలో గంటపాటు అంధకారం
ABN, Publish Date - Mar 10 , 2025 | 12:46 AM
రుయాలో ఆదివారం ఉదయం గంటపాటు విద్యుత్తు సరఫరాలేక అంధకారం నెలకొంది. కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ముందే చెప్పినా జనరేటర్‌ను సిద్ధం చేసుకోవడంలో అధికారులు విఫలమవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ముందే చెప్పి సరఫరా ఆపిన డిస్కం అధికారులు
జనరేటర్‌ను సిద్ధం చేసుకోవడంలో ఆస్పత్రి వర్గాల వైఫల్యం
వెంటిలేటర్లపై రోగుల అవస్థలు
తిరుపతి(వైద్యం), మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రుయాలో ఆదివారం ఉదయం గంటపాటు విద్యుత్తు సరఫరాలేక అంధకారం నెలకొంది. కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ముందే చెప్పినా జనరేటర్‌ను సిద్ధం చేసుకోవడంలో అధికారులు విఫలమవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న.. వెంటిలేటర్లపై ఉన్న రోగులు ఇబ్బంది పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. విద్యుత్తు మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటలకు సరఫరాను నిలిపేస్తున్నట్లు రుయాస్పత్రిలోని విద్యుత్తు విభాగ సిబ్బందికి శనివారం సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఆస్పత్రిలో జనరేటర్‌ను సిద్ధం చేసుకోవాల్సిన విద్యుత్తు సిబ్బంది ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. జనరేటర్ మరమ్మతులకు గురైన విషయాన్నీ రుయా అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. ఆదివారం ఉదయం 9 గంటలకు సరఫరా ఆగడంతో ఆస్పత్రి అంధకారంతో నిండిపోయింది. అరగంట గడిచినా అత్యవసర విభాగం, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ వంటి వార్డుల్లో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో రోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ విషయాన్ని వార్డుల్లోని సిబ్బంది రుయా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. జనరేటర్ మరమ్మతులకు గురై ఉండటంతో విద్యుత్తు సరఫరా నిలిచిన వెంటనే సరఫరా చేయడానికి వీలు కాలేదని రుయాలోని విద్యుత్తు సిబ్బంది అధికారులకు వివరించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని ముందుగానే తెలిసినా ఎందుకు జనరేటర్‌ను సిద్ధం చేసుకోలేదని సూపరింటెండెంట్ రవిప్రభు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరేటర్ పనిచేయడం లేదనే విషయాన్ని తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. అప్పటికే పలు వార్డులో వెంటిలేటర్లపై ఉన్న రోగుల పరిస్థితి గందరగోళంగా మారడంతో అక్కడి సిబ్బంది, డాక్టర్లు ఆ విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువచ్చారు. అప్పటికప్పుడే జనరేటర్‌కు మరమ్మతులు చేపట్టి పది గంటలకు సరఫరాను పునరుద్ధరించారు.
ఆ గంటలో ఇద్దరు శిశువుల మృతి!
ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్య, విద్యుత్తు సరఫరా లేని సమయంలో రుయాలోని చిన్నపిల్లల విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఇద్దరు శిశువులు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అధికారులు చిన్నపిల్లల విభాగానికి చేరుకొని మృతిచెందిన శిశువులను పరిశీలించాక.. మిగతా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ శిశువుల మృతి అనారోగ్యం వల్లే కానీ.. కరెంటు లేక కాదని వైద్యవర్గాలు అంటున్నాయి.
Updated Date - Mar 10 , 2025 | 12:46 AM