‘బనకచర్ల’తో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం
ABN, Publish Date - Feb 18 , 2025 | 05:42 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెంది.. రాష్ట్ర ముఖచిత్రం మారనుందని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు,
ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలి: ఆళ్ల గోపాలకృష్ణారావు
విజయవాడ (గాంధీనగర్), ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెంది.. రాష్ట్ర ముఖచిత్రం మారనుందని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ప్రాంతాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సోమవారమిక్కడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడుతుందన్నారు. వెలిగొండ, నాగార్జున సాగర్ కుడి కాలువ, కండలేరు, సోమశిల ప్రాజెక్టుల కింద ప్రస్తుతమున్న 22 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. అలాగే పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతించారు. కృష్ణా జలాల్లో ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీరు దక్కుతోందని.. దీనిని యథాతథంగా కొనసాగించేలా బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఈ నెల 19న తన వాదనను రాష్ట్రప్రభుత్వం సమర్థంగా వినిపించాలని కోరారు. భేటీలో కృష్ణా తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌లు దేవరబోయిన వెంకటేశ్వరరావు, పంతాని మురళీధరరావు, నాగార్జునసాగర్ ఎడవ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 18 , 2025 | 05:42 AM