unique: యూనిక్ తంటాలు..!
ABN, Publish Date - Feb 18 , 2025 | 12:14 AM
అగ్రి స్టాక్‌లో (ఏపీ ఫార్మర్ రిజిస్ర్టేషన) రైతుల వివరాల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రైతులకు యూనిక్ నంబర్ కేటాయింపునకు ఆటంకం ఏర్పడుతోంది.
ఒకే సర్వే నంబరులో ఎక్కువ పేర్లున్నా అంతే..
నత్తనడకన సాగుతున్న రిజిసే్ట్రషన ప్రక్రియ
అనంతపురం అర్బన, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): అగ్రి స్టాక్‌లో (ఏపీ ఫార్మర్ రిజిస్ర్టేషన) రైతుల వివరాల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రైతులకు యూనిక్ నంబర్ కేటాయింపునకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నెల 7వతేదీ నుంచి జిల్లాలో రైతుల రిజిస్ర్టేషన ప్రక్రియ ఆరంభమైంది. అయితే ఆశించిన స్థాయిలో రిజిస్ర్టేషన ముందుకు సాగడం లేదు. సాంకేతిక కారణాలు, మండలాల్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని అంటున్నారు. జిల్లాలో 4 లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. ఇప్పటి దాకా 32,027 మంది రైతుల వివరాలను రిజిస్ట్రేషన చేశారు. అత్యధికంగా గుంతకల్లు మండలంలో 2,994 మంది రైతులు వివరాలు నమోదు చేశారు. తాడిపత్రి 2,852, కణేకల్లు 2,534, పెద్దవడుగూరు 2,223, గుత్తి 2,049, యాడికి 1,901, విడపనకల్లు 1,800, పెద్దపప్పూరు 1,516, రాయదుర్గం 1,458, గార్లదిన్నె 1,303, పామిడి 989, గుమ్మగట్ట 962, బొమ్మనహాళ్ 832, నార్పల 820, కూడేరు 748, డి.హిరేహాళ్ 715, యల్లనూరు 677, అనంతపురం 529, బుక్కరాయసముద్రం 528, ఉరవకొండ 493, రాప్తాడు 475, బ్రహ్మసముద్రం 450, పుట్లూరు 443, కంబదూరు 419, ఆత్మకూరు 416, శింగనమల 413, బెలుగుప్ప 377, కల్యాణదుర్గం 324, శెట్టూరు 286, వజ్రకరూరు 266, కుందుర్పి 235 మంది రైతుల వివరాలను నమోదు చేశారు.
లక్ష్యం సాధ్యమేనా..?
పీఎం కిసాన లబ్ధిదారుల్లో 30 శాతం మంది వివరాలను ఈ నెలాఖరులోగా నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 2.79 లక్షల మంది పీఎం కిసాన లబ్ధిదారులున్నారు. వీరిలో 30 శాతం అంటే 83,700 మంది రైతుల వివరాల నమోదు పూర్తికావాలి. దీనికి మరో 10 రోజులే గడువు ఉంది. ఆలోగా లక్ష్యం సాధ్యమేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. డి. పట్టా రైతుల వివరాలు నమోదు చేసే ఆప్షన ఇవ్వలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒకే సర్వే నంబర్‌తో ఒకటి కంటే ఎక్కువ మంది రైతుల వివరాలుంటే, ఆ రైతుల పేర్లు కనిపించడం లేదు. జిల్లాలో ఎక్కువ శాతం సర్వే నంబర్లకు రైతుల పేర్లు డిప్‌ప్లే కాకపోవంతో ఏం చేయాలో తెలియక ఆర్‌ఎ్‌సకే సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని సమాచారం.
రిజిసే్ట్రషన ఇలా..
రైతులు తమ ఆధార్, పట్టాదారుల పుస్తకం, ఆధార్‌తో లింకైన సెల్ నంబర్‌ను రైతు సేవా కేంద్రాలకు తీసుకువెళ్లాలి. అక్కడి సిబ్బంది అగ్రిస్టాక్ వెబ్ సైట్‌లో రైతుల వివరాలతో రిజిస్ర్టేషన చేస్తారు. రైతు వివరాల నమోదులో భాగంగా తొలుత ఆధార్ వెరిఫికేషన కోసం ఒక ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మొబైల్ వెరిఫికేషన కోసం మరో ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఈ సైన కోసం మరో ఓటీపీ అడుగుతుంది. మూడు ఓటీపీలు పూర్తైన తర్వాత రైతు రిజిస్ర్టేషన విజయవంతం అయినట్లు రైతు సెల్ నంబర్‌కు మరో సంక్షిప్త సమాచారం వెళుతుంది. ఆ మెసేజ్ వచ్చిన 48 గంటల తర్వాత 11 నంబర్లతో కూడిన యూనిక్ నంబర్ మెసెజ్ ద్వారా వస్తుంది.
Updated Date - Feb 18 , 2025 | 12:14 AM