4.86 లక్షల టన్నుల ధాన్యం ప్రశ్నార్థకం!
ABN, Publish Date - Feb 25 , 2025 | 01:30 AM
పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి రైతుల సహనానికి పరీక్ష పెడుతోంది. పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు చెబుతున్నా అధికారులు ససేమీర అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతుల వద్ద 4.86 లక్షల టన్నుల ధాన్యం ప్రశ్నార్థకంగా మారింది. ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాలకు, మిల్లర్ల వద్దకు వెళితే అనుమతులు రాలేదని తిప్పి పంపేస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించి అడుగుతున్నారు. నగదు చెల్లింపుల్లో ఆసల్యం జరుగుతుందని షరతులు పెడుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.
-జిల్లాలో నిలిచిపోయిన కొనుగోళ్లు
-కుప్పల్లో 2.38 లక్షల టన్నులు.. రైతుల వద్ద మరో 2.48 లక్షల టన్నుల నిల్వలు
-ఇప్పటివరకు ప్రభుత్వం కొన్న ధాన్యం 5.80 లక్షల టన్నులు
-మిగిలిన ధాన్యం కూడా కొనాలని రైతుల వేడుకోలు
- పట్టించుకోని పౌరసరఫరాలశాఖ అధికారులు
- ఇదే అదనుగా తక్కువ ధరకు అడుగుతున్న మిల్లర్లు, ప్రైవేటు వ్యక్తులు
పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి రైతుల సహనానికి పరీక్ష పెడుతోంది. పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు చెబుతున్నా అధికారులు ససేమీర అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతుల వద్ద 4.86 లక్షల టన్నుల ధాన్యం ప్రశ్నార్థకంగా మారింది. ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాలకు, మిల్లర్ల వద్దకు వెళితే అనుమతులు రాలేదని తిప్పి పంపేస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించి అడుగుతున్నారు. నగదు చెల్లింపుల్లో ఆసల్యం జరుగుతుందని షరతులు పెడుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :
జిల్లాలో 302 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సంక్రాంతి పండుగ ముందువరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మిల్లు యజమానులు చెల్లించిన బ్యాంకు గ్యారంటీ అయిపోయిందని, మిల్లులకు ఇచ్చిన ధాన్యం టార్గెట్‌లు పూర్తయ్యాయని ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. ప్రస్తుతం మినుమ తీత పనులు జరుగుతున్నాయి. దీంతో పాటే రైతులు కుప్పనూర్పిడి చేస్తున్నారు. ధాన్యం శాంపిళ్లను రైతు సేవా కేంద్రాలకు రైతులు తీసుకువెళితే ఆన్‌లైన్ ప్రక్రియ నిలిచిపోయిందని, ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైస్ మిల్లులకు ధాన్యం విక్రయించుకోవాలని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం కుప్పల్లో ధాన్యం 2.38 లక్షల టన్నుల ధాన్యం ఉందని, కుప్పలు నూర్పిడి చేసి విక్రయించడానికి రైతుల వద్ద మరో 2.48 లక్షల టన్నులు ఉందని పౌరసరఫరాలశాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులకు జాయింట్ కలెక్టర్ లేఖ రాశారు. అయినా ఽధాన్యం కొనుగోలుకు అనుమతులు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 75కిలోల ధాన్యం బస్తా రూ.1,725 కొనుగోలు చేయాలి. రైతులు మిల్లు యజమానుల వద్దకు ధాన్యం శాంపిళ్లను తీసుకువెళితే రూ.1,520లకు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ప్రైవేటుగా కొనుగోలు చేసిన ధాన్యం మరపట్టి బియ్యంగా మార్చి కాకినాడ పోర్టుకు తరలించాలని, దీంతో అన్ని ఖర్చులు కలుపుకుని అంతకుమించి ధరను ఇవ్వలేమని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. ఈ ధరకైనా ఇప్పటికిప్పుడు ధాన్యం కొనుగోలు చేయలేమని, ఽధాన్యం బిల్లులు ఆలస్యమవుతాయని చెప్పడం గమనార్హం. ఎకరానికి 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే ఈ ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తే మద్ధతు ధర బస్తాకు రూ.225లను నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు చేసిన ధాన్యం 5.80 లక్షల టన్నులే..
జిల్లాలో గత ఖరీఫ్ సీజన్‌లో 1.67 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. 9.79 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వారం రోజుల కిందటి వరకు 5.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ఇటీవల మరో 30వేల టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ 30వేల టన్నుల ధాన్యానికి సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను గంట వ్యవధిలోనే పూర్తి చేశారు. గతేడాది నవంబరు 13 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. గత నాలుగు నెలల వ్యవధిలో 5.80 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సర్వర్‌ను నిలిపివేస్తారు. ఈ నెల రోజుల వ్యవధిలో 4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇంత మేర కొనుగోలు చేసేందుకు ఎప్పటికి అనుమతులు ఇస్తారు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పౌరసరఫరాలశాఖ అధికారులు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలుకు అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Feb 25 , 2025 | 01:30 AM