నల్లగొండలో ఆపరేషన్ చబూత్ర
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:46 AM
నల్లగొండ జిల్లాకేంద్రంలో శనివారం రాత్రి పోలీసులు ఆపరేషన్ చబూత్ర నిర్వహించారు.
154మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్
88 బైకులు, 6 కార్లు, 78 సెల్‌ఫోన్లు స్వాధీనం
నల్లగొండ క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాకేంద్రంలో శనివారం రాత్రి పోలీసులు ఆపరేషన్ చబూత్ర నిర్వహించారు. ఎలాంటి అవసరం లేకపోయినా అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న పలువురిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో శనివారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీలను అష్టదిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై అనవసరంగా రోడ్లపై తిరిగే చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇద్దరు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 98 మంది కానిస్టేబుళ్లతో కలిసి 13 చెకింగ్ బృందాలుగా, 10 పెట్రోలింగ్ పార్టీలుగా ఏర్పడి ఆపరేషన్ చబూత్ర నిర్వహించినట్లు తెలిపారు. రోడ్లపై అర్ధరాత్రి రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించి, వారి వద్ద నుంచి 88బైక్‌లు, ఆరు కార్లు, 15ఆటోలు, 78 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 54మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డిసెంబరు 31వ తేదీ నేపథ్యంలో అర్థరాత్రి అరుగుల(చబుత్ర)పై బతకాని మాట్లాడుతూ కూర్చొవద్దని సూచించారు. డిసెంబరు 31వ తేదీని యాక్సిడెంట్, ఇన్సిడెంట్ ఫ్రీగా నల్లగొండ పట్టణాన్ని చేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు, 30 ఏళ్ల లోపు వారే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొస్తే చాలా నేరాలు తగ్గుముఖం పడుతాయన్నారు. ఆపరేషన్ చబూత్రలో పట్టుపడిన వారందరినీ జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సెంటర్‌లో వారి తల్లిదండ్రుల సమక్ష్యంలో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దూది రాజు, ఎస్‌ఐలు రావుల నాగరాజు, జూకూరి సైదులు, సురేష్, సందీప్, శంకర్ ఉన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 12:46 AM