సంబురాలకు సై
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:41 PM
కాలగతిలో మరో సంవత్సరం కలిసిపోనున్నది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి పాలమూరు ప్రజలు సిద్ధం అవుతున్నారు.
- న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతున్న ప్రజలు
- ఒక్కరోజే రూ.27.90 కోట్ల విలువైన మద్యం దిగుమతి
- డిపోల ముందు మద్యం దుకాణాలు, బార్ల యజమానుల క్యూ
- వైన్ షాపులకు అర్ధరాత్రి 12, బార్‌లకు ఒంటి గంట వరకు అనుమతి
- విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న బేకరీలు
- 31న మధ్యాహ్నం నుంచే ప్రారంభం కానున్న సందడి
మహబూబ్‌నగర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కాలగతిలో మరో సంవత్సరం కలిసిపోనున్నది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి పాలమూరు ప్రజలు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 31వ తేదీ, మంగళవారం 2024 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి, నూతన సంవత్సరం 2025కు ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. మధ్యాహ్నం నుంచే వేడుకల జోరు మొదలు కాన్నుది. అందుకోసం ఇప్పటికే స్నేహితులు, కాలేజీ విద్యార్థులు, ఇరుగు పొరుగు ఇళ్ల వారు, అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న వారు దావత్‌లు చేసుకునేం దుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
భారీగా మద్యం దిగుమతి
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగనున్నాయి. అందుకోసం ఉమ్మడి జిల్లాకు చెందిన వైన్‌షాపులు, బార్ల యజమానులు సోమవారం తిమ్మాజిపేట, కొత్తకోట మద్యం డిపోల వద్ద బారులు తీరారు. ఒక్క రోజే రూ.27.90 కోట్ల విలువైన మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. తిమ్మాజిపేట డిపో నుంచి రూ.17.30 కోట్లు, కొత్తకోట డిపో నుంచి రూ.10.60 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు. రాత్రి ఎనిమిది గంటల తరువాత కూడా డిపోల వద్ద మద్యం వ్యాపారుల సందడి తగ్గ లేదు. భారీగా మద్యం దిగుమతి చేసుకోవడంతో అన్ని దుకాణాలు కళకళలాడుతున్నాయి.
మద్యం దుకాణాల సమయం పెంపు
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని పొడగించింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయాలకు అనుమతి ఉండగా, మంగళవారం రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. అలానే 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండే బార్లకు అర్దరాత్రి ఒంటిగంట వరకు సమయాన్ని పొడిగించింది. మద్యం విక్రయా లతో పాటు మాంసం విక్రయాలు కూడా పెద్ద ఎత్తున సాగనున్నాయి. మటన్, చికెన్ దుకాణాలు కిటకిటలాడ నున్నాయి. ఇటీవలే పాలమూరులో ప్రారంభం అయిన కెఎఫ్‌సీతో పాటు, రెస్టారెంట్లు, హోటళ్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం భోజన ప్రియు లను ఆకట్టుకునేలా నాన్‌వెజ్ వంటకాలను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కళకళలాడుతున్న బేకరీలు
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటలకు అందరూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ సందర్భంగా బేకరీల్లో కేక్‌ల విక్రయాలు జోరుగా సాగనున్నాయి. అందుకోసం మహబూబ్‌నగర్ పట్టణంలోని బేకరీలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. సోమవారం పెద్ద సంఖ్యలో జనం కేక్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చారు. దీంతో బేకరీల యజమానులు అధిక సంఖ్యలో కేక్‌లను సిద్ధం చేస్తున్నారు. కేక్‌ల విక్రయానికి బేకరీల యజమానులు దుకాణల ముందు ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జూనియర్ కళాశాలలు, వివిధ విద్యాసంస్థలు, కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో నివసించేవారు కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు మ్యూజిక్ సిస్టంలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
సంతోషంగా వేడుకలు జరుపుకోవాలి : ఎస్పీ
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటుండగా, వేడుకలు శ్రుతి మించకుండా, మందుబాబులను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ సిద్ధం అవుతోంది. న్యూ ఇయర్ వేడుకలను జిల్లా ప్రజలు సంతో షంగా జరుపు కోవాలని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. డీజేలపై నిషేధం ఉందని, ఎవరైనా వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మైన ర్లకు వాహనాలు ఇవ్వొద్దని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తీసి వాహనం నడిపే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు నిర్వహణకు పోలీసుల నుంచి ముంద స్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆంక్షలను అతిక్రమించినా, ఉల్లంఘించినా, ఇబ్బంది కలిగించినా ప్రజలు 100కు లేదా, కమాండ్ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ 8712659630కు కాల్ చేయాలని కోరారు. యువతీ యువకులు తమ కుటుంబసభ్యులతో ప్రశాంత వాతా వరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. 2025లో జిల్లా ప్రజలకు అంతా సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరపున జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Dec 30 , 2024 | 11:41 PM