అప్‌గ్రేడ్‌పై ఆశలు
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:38 PM
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి మహర్దశ పట్టనుంది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ దవాఖాన మరో మైలురాయి దాటనుంది. ఇప్పటికే 12 రకాల సేవలు ఇక్కడ అందిస్తుండగా మరిన్ని అందుబాటులోకి రానున్నాయి.
జీజీహెచ్‌కు త్వరలోనే మహర్దశ
ఆస్పత్రి అభివృద్ధిపై దృష్టిసారించిన వైద్య శాఖ
మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి దామోదర సుముఖం
త్వరలోనే 200 బెడ్ల ఆస్పత్రిగా పురోగతి
రూ. 4 కోట్లతో అందుబాటులోకి రానున్న సిటీ స్కాన్
భూపాలపల్లి కలెక్టరేట్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి మహర్దశ పట్టనుంది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ దవాఖాన మరో మైలురాయి దాటనుంది. ఇప్పటికే 12 రకాల సేవలు ఇక్కడ అందిస్తుండగా మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. దీంతో భూపాలపల్లి జిల్లా ప్రజలకే కాకుండా పెద్దపల్లి, మహారాష్ట్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహ దీనిపై ఇప్పటికే సంకేతాలు ఇవ్వగా ఈ ఆస్పత్రి అభివృద్ధి త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. దీని నిర్వహణపై మంత్రి దామోదర సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు హామీలు ఇచ్చారు.
దృష్టిసారించిన మంత్రి దామోదర
జీజీహెచ్‌లో అందుతున్న సేవల ప ట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వరాల జల్లు కురిపించారు. ఇటీవల జిల్లా పర్యటన లో భాగంగా ఆస్పత్రిలో పలు శంకుస్థా పనలు చేశారు. ఆస్పత్రికి మరిన్ని సౌక ర్యాలు అవసరం ఉందని ఆయన దృష్టికి రాగా వెంటనే ఓకే చెప్పేశారు. ఆస్పత్రిలో రూ.4 కోట్లతో 32స్లైస్ సామర్థ్యం కలిగిన సిటీ స్కానింగ్ మిషన్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటిం చారు. ఈసీఎల్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధుల నుంచి సిటీ స్కానింగ్ మిషన్‌ను జీజీహెచ్‌కు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జనవరి నెలఖారులో ఆస్పత్రిలో సిటీ స్కానింగ్ సేవలు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రూ.80లక్షలు విలువ చేసే నాలుగు వెంటిలేటర్స్‌ను కూడా మంత్రి మంజూరు చేశారు.
త్వరలోనే అప్‌గ్రేడ్
జీజీహెచ్ త్వరలోనే అప్‌గ్రేడ్ కానుంది. 140 పడకల ఆస్పత్రిగా ఉన్న 200 పడకల స్థాయికి చేరనుంది. ఇప్పటికే భూపాల పల్లి, పెద్దపల్లి జిల్లాల ప్రజలకు, మహారాష్ట్ర వాసులకు మెరుగైన సేవలు అందిస్తున్న ఈ వైద్యశాలలో మరిన్ని అందుబాటులోకి వస్తే కార్పొరేట్ స్థాయి వైద్యం అందే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే 12 రకాల వైద్యసేవలు
ప్రస్తుతం జీజీహెచ్‌లో 12 రకా ల వైద్యసేవలు ప్రజలకు అందుతు న్నాయి. అనస్థేషియా, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్‌టీ, డెంటల్, పీడియాట్రిషన్, రేడియా లజీ, సైకాలజీ, ఫిజియెథెరపీ, కంటి వైద్యం అం దుబాటులో ఉన్నాయి. వీటిలో జనరల్ మెడిసిన్, సర్జరీ, అనస్థేషియా, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిషన్ వంటి సేవలు 24 గంటలు ప్రజలకు అందుతున్నాయి. ఆస్పత్రి మెడికల్ కాలేజీకి అనుబంధం గా ఉండటంతో సీనియారిటీ కలిగిన వైద్యులు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రొఫెసర్లు అయిన మంచి పేరు గల డాక్టర్లు నవీన్ కుమార్, నాగార్జునరెడ్డి, రాజేంద్రప్రసాద్, రఘు, సురేందర్, కవిత, రాజేష్ అందుబాటులో ఉంటున్నారు. వీరితో పాటు మరో 42మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు.
- రోజూ సగటున 500 ఓపీలు
జీజీహెచ్ సేవలు రోజురోజుకూ విసృత్తమవుతున్నాయి. పీహెచ్‌సీ స్థాయి నుంచి జీజీహెచ్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి రోజూ ఇక్కడ 400-500 మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. దీంతోపాటు మరిన్ని సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఆస్పత్రిలో జరిగే డెలవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి నెల 200 వరకు డెలవరీలు ఆస్పత్రిలో జరుగుతున్నాయి. నవంబరులో 200 పైచిలుకు డెలవరీలు ఆస్పత్రిలో జరిగాయి. ఇక్కడి డెలవరీల్లో 60 శాతానికి పైగా సాధారణ కన్పులే ఉన్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ సాధారణ డెలవరీలపై సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. జీజీహెచ్‌లో జరిగే సర్జరీల సంఖ్య కూడా అధికంగానే ఉంది. వెంటిలేటర్ అవసరం లేని సర్జరీలు ఆస్పత్రిలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ప్రతి నెల 200- 250కిపైగా సర్జరీలు జీజీహెచ్‌లో జరుగుతున్నాయి. డెలవరీలు, సర్జరీలతో పాటు హైరిస్క్ కేసులను కూడా జీజీహెచ్‌లో పరిష్కరిస్తున్నారు.
- మెరుగైన సేవలు అందిస్తున్నాం
- రాహుల్‌శర్మ, భూపాలపల్లి కలెక్టర్
జీజీహెచ్‌లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఆస్పత్రి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండటంతో ఎంతో అనుభవం ఉన్న వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఆస్పత్రిలో సిటీ స్కానింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆస్పత్రిలో శానిటేషన్ పనులను మెరుగుపర్చుకునేందుకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం.
Updated Date - Dec 21 , 2024 | 11:38 PM