KTR: ఆ ఎన్నికలను ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలి.. కేటీఆర్ పిలుపు
ABN, Publish Date - Jan 18 , 2024 | 04:52 PM
ఈ ఏడాదిలో వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని.. వీటిని ఎదుర్కోవడం కోసం పార్టీ సంసిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు.
ఈ ఏడాదిలో వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని.. వీటిని ఎదుర్కోవడం కోసం పార్టీ సంసిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని నమ్మకం వెలిబుచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పని చేయాలని కోరారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామన్నారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని.. అందులోనే శాసన మండలి పార్టీ నేతను ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌కు గుర్తు చేస్తామన్నారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని హెచ్చరించారు. శాసనమండలి సభ్యులు పార్టీకి కళ్లు, చెవుల మాదిరిగా పని చేయాలని అన్నారు. శాసనమండలి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పునర్య్వవస్థీకరించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Updated Date - Jan 18 , 2024 | 05:29 PM