కంగారూ ‘పంచ్’
ABN, Publish Date - Dec 31 , 2024 | 06:21 AM
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టుకు ఘోరపరాభవం ఎదురైంది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 184 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఫలితంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సిరీ్‌సలో...
కాస్త గట్టిగానే!
జూ184 రన్స్ తేడాతో భారత్ పరాజయం
జూరెండో ఇన్నింగ్స్ 155
జూజైస్వాల్ ఒంటరి పోరాటం
జూబాక్సింగ్ డే టెస్టు
లక్ష్యం 340 పరుగులు.. 92 ఓవర్లు.. 11 మంది ఆటగాళ్లు. ఇదీ ఆఖరిరోజు సోమవారం భారత్ ముందున్న పరిస్థితి. ఈ స్థితిలో విజయమో.. లేదంటే డ్రా కోసమో జట్టు ఆడుతుందని అంతా ఆశించారు. కానీ మెల్‌బోర్న్ మైదానంలో జరిగింది వేరు. ముందురోజు ఆసీస్ టెయిలెండర్లు చూపిన తెగువ కూడా భారత బ్యాటర్లలో కనిపించలేదు. జైస్వాల్, పంత్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా, అండగా నిలవాల్సిన రోహిత్, విరాట్ సహా అంతా విఫలమయ్యారు. 34 రన్స్‌కే చివరి 7 వికెట్లను పడగొట్టి ఆసీస్ బౌలర్లు తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టుకు ఘోరపరాభవం ఎదురైంది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 184 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఫలితంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సిరీ్‌సలో 2-1తో ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన సిడ్నీ టెస్టు జనవరి 3 నుంచి జరుగుతుంది. 340 పరుగుల ఛేదనలో ఆఖరి రోజు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (84), పంత్ (30) నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కమిన్స్, బోలాండ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. లియోన్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు ఆసీస్ ఆఖరి రోజు పది బంతులే ఆడి రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద ముగించింది. బుమ్రాకు 5, సిరాజ్‌కు 3 వికెట్లు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474, భారత్ 369 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
జైస్వాల్-పంత్ మినహా..: భారీ ఛేదనలో మూడు సెషన్ల ఆట ఉండడంతో డ్రా కోసమైనా భారత ఆటగాళ్లు పోరాడతారనిపించింది. కానీ జైస్వాల్-పంత్ భాగస్వామ్యం మినహా చెప్పుకోవడానికేమీ లేకపోయింది. ఆరంభంలో క్రీజులో ఉన్నంతసేపు కెప్టెన్ రోహిత్ (9) చక్కటి డిఫెన్స్‌ను ప్రదర్శించాడు. కానీ 17వ ఓవర్‌లో కమిన్స్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. అతడి ఫుల్లర్ బాల్‌ను ఫ్లిక్ చేయబోయిన రోహిత్ గల్లీలో వికెట్‌ను సమర్పించుకోగా, రాహుల్ ఓ అద్భుత బంతికి డకౌటయ్యాడు. ఇక అండగా నిలుస్తాడనుకున్న విరాట్ కోహ్లీ (5) లంచ్ బ్రేక్‌కు ముందు మరోసారి ఆఫ్‌సైడ్ ఆవల బంతిని ఆడి పెవిలియన్ చేరాడు. దీంతో 33/3 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. కానీ రెండో సెషన్‌ను జైస్వాల్-పంత్ జోడీ జాగ్రత్తగా ఆడి వికెట్‌ను కోల్పోకుండా ముగించింది. వీరిద్దరు ఆసీ్‌సను దీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పంత్ ఓపికగా క్రీజులో పాతుకుపోయాడు. తన సహజశైలిని పక్కనబెట్టి వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అటు జైస్వాల్ అర్ధసెంచరీని పూర్తి చేసుకోవడంతో ఈ సెషన్‌ను జట్టు 112/3తో ముగించింది.
పేకమేడలా..: రెండు సెషన్ల ఆటను చూస్తే భారత్ ఫర్వాలేదనే స్థితిలో కనిపించింది. ఆఖరి సెషన్‌లో మరో 38 ఓవర్ల ఆట మిగిలి ఉండగా చేతిలో 7 వికెట్లున్నాయి. ఈ దశలో డ్రా ఖాయమనిపించింది. కానీ ఇలాంటి కీలక స్థితిలో పంత్ నిర్లక్ష్యపు షాట్ కొంపముం చింది. హెడ్ ఓవర్‌లో భారీ షాట్ ఆడిన పంత్ బౌండరీ లైన్ వద్ద మార్ష్‌కు చిక్కాడు. అంతే.. ఈ వికెట్ తర్వాత ఆసీస్ బౌలర్లు ఒకరి తర్వాత మరొకరిని పెవిలియన్‌కు క్యూ కట్టించారు. ఓవైపు సుందర్ (5 నాటౌట్) ఓపిగ్గా ఆడినా చివర్లో అతడికి సహకారం కరువైంది.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474;
భారత్ తొలి ఇన్నింగ్స్: 369;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 234.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) క్యారీ (బి) కమిన్స్ 84; రోహిత్ (సి) మార్ష్ (బి) కమిన్స్ 9; రాహుల్ (సి) ఖవాజా (బి) కమిన్స్ 0; విరాట్ (సి) ఖవాజా (బి) స్టార్క్ 5; పంత్ (సి) మార్ష్ (బి) హెడ్ 30; జడేజా (సి) క్యారీ (బి) బోలాండ్ 2; నితీశ్ (సి) స్మిత్ (బి) లియోన్ 1; సుందర్ (నాటౌట్) 5; ఆకాశ్ (సి) హెడ్ (బి) బోలాండ్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) బోలాండ్ 0; సిరాజ్ (ఎల్బీ) లియోన్ 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 79.1 ఓవర్లలో 155 ఆలౌట్. వికెట్ల పతనం: 1-25, 2-25, 3-33, 4-121, 5-127, 6-130, 7-140, 8-150, 9-154, 10-155. బౌలింగ్: స్టార్క్ 16-8-25-1; కమిన్స్ 18-5-28-3; బోలాండ్ 16-7-39-3; మార్ష్ 3-2-2-0; లియోన్ 20.1-6-37-2; హెడ్ 5-0-14-1; లబుషేన్ 1-1-0-0.
ఓటమి వేధిస్తోంది
ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాం. ఓటమి మానసికంగా వేధిస్తోంది. ఆఖరిదాకా పోరాడాలని భావించినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ఆసీస్‌ను 90/6తో కట్టడి చేసినా ఆ తర్వాత పట్టు కోల్పోయాం. ఇక చివరి రోజు 340 పరుగుల ఛేదన సులువు కాదని తెలుసు. మా ప్రణాళికలు ఫలించలేదు. పంత్ కీలక సమయంలో అవుటయ్యాడు. ఆ వికెట్ పడ్డాక మా పరిస్థితి దిగజారింది. కానీ అతడు ఆడిన తీరును తప్పుపట్టలేం. ఎన్నో సమయాల్లో అతను జట్టుకు విజయాలందిం చాడు. కానీ తన నుంచి జట్టుకు ఏం కావాలో కూడా పంత్ అర్ధం చేసుకోవాలి. బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి సహకారం అందడం లేదు.
రోహిత్ శర్మ
Updated Date - Dec 31 , 2024 | 06:21 AM