నాసిరకమే..
ABN, Publish Date - Jan 05 , 2024 | 03:59 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రధాన రహదారులతో పాటు వీధుల్లోనూ తరచూ మ్యాన్‌హోల్స్ మూతలు ధ్వంసమవుతున్నాయి.
గ్రేటర్‌లో మ్యాన్‌హోల్స్ తీరిది
వాహనాలు వెళ్తే పగులుతున్న మూతలు
ప్రధాన రోడ్లతోపాటు వీధుల్లోనూ ఇదే పరిస్థితి
భయాందోళనలో పాదచారులు, వాహనదారులు
నాణ్యతా లోపం వల్లేనంటున్న ప్రజలు
పట్టించుకోని వాటర్ బోర్డు అధికారులు
హైదరాబాద్ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రధాన రహదారులతో పాటు వీధుల్లోనూ తరచూ మ్యాన్‌హోల్స్ మూతలు ధ్వంసమవుతున్నాయి. వాటిపై నుంచి భారీ వాహనాలు వెళ్లినా పగలకుండా ఉండాల్సి ఉండగా.. నిర్మించి మూతలు ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే పగిలిపోతున్నాయి. వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. నాసిరకమైన మూతల వల్లే పగిలిపోతున్నాయనే ఆరోపణలున్నాయి.
హెచ్‌డీ-35 మూతల్లో లోపాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రధాన రోడ్లు, కాలనీలు, బస్తీల రోడ్లను రీకార్పెటింగ్ చేసిన సందర్భాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు ఎగుడుదిగుడుగా మారుతున్నాయి. దాంతో వాటర్ బోర్డు అధికారులు మ్యాన్‌హోల్ మరమ్మతులు చేపట్టి రోడ్డుకు సమాంతరంగా మూత ఎత్తు పెంచుతున్నారు. ఈ ప్రక్రియ వాటర్ బోర్డు పరిధిలో వివిధ డివిజన్ల వారీగా యేటా జరిగేదే. ప్రధాన రోడ్లలో హెచ్‌డీ-35 సామర్థ్యం కలిగిన మూతలను వాటర్‌బోర్డు సరఫరా చేస్తుండగా కాలనీలు, వీధుల్లో హెచ్‌డీ-20 సామర్థ్యం కలిగిన మూతలను వినియోగిస్తారు. హెచ్‌డీ-35 మూతలపై నుంచి భారీ వాహనాలు వెళ్లినా పగిలే అవకాశం ఉండదు. కానీ ఇటీవల అమర్చిన హెచ్‌డీ-35 సామర్థ్యం కలిగిన మ్యాన్‌హోల్ మూతల మీదుగా చిన్న వాహనాలు వెళ్లినా పూర్తిగా పగిలిపోతున్నాయి. జీడిమెట్లలోని కాటన్ రెసిడెన్షియల్ టౌన్‌షిప్ సమీపంలో రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ కవర్ పగిలిపోయింది. ఎల్‌బీనగర్‌లోని షాగౌస్ ఎదురుగా రోడ్డుపై మ్యాన్‌హోల్ పగిలి కుంగి ప్రమాదకరంగా మారింది. శాలిబండ డివిజన్‌లోని అలియాబాద్ జెండాలోని పాన్ షాప్ ఎదురుగా మ్యాన్‌హోల్ మూత కూడా ధ్వంసమైంది. ఇలా నగర పరిధిలో అనేకచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం నాణ్యతా లోపమేనని స్పష్టమవుతోంది.
ఇష్టారీతన కాంట్రాక్టర్లు..
నగరంలోని అన్ని ప్రాంతాలకు మ్యాన్‌హోల్స్ మూతలను వాటర్ బోర్డులోని సెంట్రల్ స్టోర్ డివిజన్ ద్వారా సరఫరా చేస్తారు. గ్రేటర్ విస్తరణలో సెంట్రల్ స్టోర్ డివిజన్‌ను విభజించినా ఆ డివిజనే కీలకంగా వ్యవహరిస్తోంది. పైపుల దగ్గరి నుంచి ప్రతీది సెంట్రల్ డివిజన్ టెండర్లు పిలిచి ఆయా వస్తువులను సమకూర్చుకుని అవసరమైన ప్రాంతాలకు కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తుంటుంది. ఇక్కడే అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడం, కాంట్రాక్టర్లతో లాలూచీ పడడంతో నాసిరకం వస్తువులు సరఫరా అవుతున్నాయి. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో ఐఎస్ బీఐఎ్‌సతోపాటు టెండర్‌లో పొందుపరిచిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం వస్తువులు లభించని పరిస్థితి నెలకొంది. అవసరమైన వ్యక్తులు, సంస్థలకే ఈ కాంట్రాక్టులు అప్పగించడంతో వారు నాణ్యతకు తిలోదకాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక కాంట్రాక్టర్ల ద్వారా జీఎంలు, మేనేజర్లు పనులు చేయిస్తున్నారు. వస్తువే నాణ్యతాలోపం ఉందనుకుంటే పనులు చేసే క్రమంలో రోడ్డుకు సమాంతరంగా మ్యాన్‌హోల్ మూతను అమర్చకపోవడం వల్లనూ మూతలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వాటర్‌బోర్డు అధికారులు తమకు సరఫరా అయిన ఆయా వస్తువులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే సంబంధిత పనులు జరిగే ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. కానీ ఎక్కడా అలా జరగడంలేదనే ఆరోపణలున్నాయి. దీనివల్ల మ్యాన్‌హోల్ మూతలను ఆయా ప్రాంతాలకు తరలించే క్రమంలో, పనుల ప్రదేశాల్లో డంప్ చేసే సందర్భాల్లో పగిలిపోతున్నాయని ఓ ఇంజనీర్ వాపోయారు.
Updated Date - Jan 05 , 2024 | 03:59 PM