Shashikala: పోయెస్ గార్డెన్‌లో శశికళ.. జయ నివాసం ముందే కొత్త ఇంటి గృహ ప్రవేశం
ABN, Publish Date - Jan 25 , 2024 | 11:21 AM
తన నెచ్చెలి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ(VK Shashikala)... ఎట్టకేలకు మళ్లీ పోయెస్ గార్డెన్‌కు చేరుకున్నారు.
పెరంబూర్(చెన్నై): తన నెచ్చెలి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ(VK Shashikala)... ఎట్టకేలకు మళ్లీ పోయెస్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న జయ నివాసంలో ఆమెతో కలిసి సుదీర్ఘకాలం జీవించిన శశికళ.. ఆమె మరణానంతరం ఆ ఇంటికి దూరమైన విషయం తెలిసిందే. ఆ తరువాత జయ ఇంటి ఎదురుగానే మరో ఇంటిని నిర్మించుకునేందుకు సన్నాహాలు చేపట్టారు. భారీస్థాయిలో నిర్మితమైన ఆ ఇల్లు ఇప్పటికి సిద్ధమైంది. దీంతో బుధవారం ప్రత్యేక పూజల అనంతరం ఆమె గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. జయలలిత పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో నివసించారు. ఆమెతో కలిసి శశికళ 30 ఏళ్లపాటు కలసి ఉన్నారు. 2016లో జయ మరణానంతరం ఆ ఇంటిని స్మారక మందిరంగా మార్చాలని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జయ మేనకోడలు, మేనల్లుడు దాఖలుచేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం... వేద నిలయాన్ని దీప, దీపక్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష విధించబడి బెంగళూరు జైలులో ఉన్న శశికళ... విడుదలైన అనంతరం వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే(AIADMK)ను ఒకటి చేయాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు.
ఆ తరువాత పలు జిల్లాల్లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టి.నగర్‌లోని తన సోదరి ఇంట్లో శశికళ ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రకటనలకే పరిమితమైన శశికళ... ఏడేళ్ల అనంతరం తొలిసారిగా రెండు రోజుల క్రితం నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లారు. ఎస్టేట్ ప్రాంగణంలో జయలలిత విగ్రహం, స్మారక మందిరం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అదే సమయంలో పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఎదురుగా ఉన్న స్థలంలో అత్యాధునిక వసతులతో కూడిన బంగ్లా నిర్మాణ పనులను 2020లో శశికళ ప్రారంభించారు. అనంతరం ఆ ఇంటిని జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నోటీసు అంటించడంతో పనుల్లో జాప్యం జరిగింది. అలాగే, శశికళకు సొంతమైన రూ.1,520 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్తంభింపజేసింది.ఆ ఆస్తులకు సంబంధించి రూ.480 కోట్లు విడుదలయ్యాయి. అనంతరం పోయెస్ గార్డెన్‌లో ఇంటి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. బుధవారం ఉదయం శశికళ ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారు. ఉదయం గోపూజ, వినాయక పూజల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం కొత్త ఇంట్లో పాలు పొంగించారు.
Updated Date - Jan 25 , 2024 | 11:21 AM