Kota: కోచింగ్ ‘కోట’కు బీటలు
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:38 AM
విద్యార్థులను వారి జ్ఞానంతో కాకుండా.. బట్టీపట్టడం ద్వారా వచ్చే మార్కులతో, ర్యాంకులతో మాత్రమే కొలిచే సమాజం మనది.
కోటాలోని కోచింగ్ సెంటర్లలో 40% మేర తగ్గిన ప్రవేశాలు
కోటా.. జాతీయస్థాయిలో పేరొందిన కోచింగ్ సెంటర్ల కేంద్రం! నీట్, యూపీఎస్సీ, ఐఐటీ జేఈఈ.. తదితర ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకునే విద్యార్థుల తొలి గమ్యస్థానం!! కానీ.. లక్షలాది మంది విద్యార్థులతో కళకళలాడిన కోటా ఇప్పుడా పూర్వవైభవాన్ని కోల్పోయింది! విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండడంతో.. అక్కడి శిక్షణ కేంద్రాల్లో కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 30-40ు మేర పడిపోయింది. ఆ ప్రభావం.. హాస్టళ్లు, మెస్‌లు, ఇతర చిరువ్యాపారాలపై తీవ్రంగా పడుతోంది!! రద్దీ లేని రోడ్లు.. ఎటు చూసినా ‘అద్దెకు’, ‘అమ్మకానికి’ అనే బోర్డులు.. ఇదీ ఇప్పుడు అక్కడి పరిస్థితి!!
తీవ్ర సంక్షోభంలోకి హాస్టళ్లు
చిరు వ్యాపారులపైనా ప్రభావం
ఐదో వంతుకు పడిపోయిన అద్దెలు
కోటా, డిసెంబరు 25: విద్యార్థులను వారి జ్ఞానంతో కాకుండా.. బట్టీపట్టడం ద్వారా వచ్చే మార్కులతో, ర్యాంకులతో మాత్రమే కొలిచే సమాజం మనది. అలాంటి చదువుల‘బట్టీ’లకు పేరొందిన నగరం.. రాజస్థాన్‌లో మూడో అతిపెద్ద నగరమైన కోటా. కండరాలు క్షీణించే (మస్క్యులర్ డిస్ట్రొఫీ) వ్యాధితో చక్రాల కుర్చీకే పరిమితమైన వినోద్ కుమార్ బన్సల్ అనే ఐఐటీ పట్టభద్రుడు.. 1991లో ఎనిమిది మంది విద్యార్థులకు తన ఇంట్లో డైనింగ్ టేబుల్ వద్ద మొదలు పెట్టిన శిక్షణ కోటాలో కోచింగ్ కేంద్రాల విస్ఫోటానికి కేంద్ర బిందువు. ఆయన దగ్గర శిక్షణ పొందిన ప్రమోద్ మహేశ్వరి అనే మరో ఐఐటీ పట్టభద్రుడు ‘కెరీర్ పాయింట్’ పేరుతో మరో కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించాడు. అలా ఒకదాని తర్వాత ఒకటిగా వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు పుట్టుకురావడంతో కోటా దేశంలోనే అతిపెద్ద ‘ప్రవేశ పరీక్షల శిక్షణ కేంద్రం’గా మారిపోయింది. ఎలెన్, రెజొనెన్స్, మోషన్, అన్‌అకాడమీ, ఫిజిక్స్‌వాలా, ఆకాశ్, సర్వోత్తమ్.. ఇలా జాతీయస్థాయిలో పేరొందిన కోచింగ్ దిగ్గజాలతోపాటు చిన్నాచితకా శిక్షణ కేంద్రాలతో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కళకళలాడుతూ వస్తున్న కోటా నగరం ఈ ఏడాది చిన్నబోయింది. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి విస్తృతంగా ప్రచారం జరగడం, కోచింగ్ సెంటర్లను నియంత్రిస్తూ ఈ ఏడాది జనవరిలో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు, ప్రముఖ కోచింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా తమ శాఖలను విస్తరించడం.. ఇలా రకరకాల కారణాల వల్ల కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గిపోయింది.
అంకెల్లో చెప్పాలంటే.. సాధారణంగా కోటాకు ఏటా దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది దాకా విద్యార్థులు.. వివిధ ప్రవేశపరీక్షలకు సంబంధించిన శిక్షణ నిమిత్తం వస్తుంటారు. కానీ, ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 85 వేల నుంచి లక్ష దాకా మాత్రమే ఉన్నట్టు సమాచారం. కోచింగ్ సెంటర్ల వల్ల అక్కడ జరిగే వ్యాపారం కిందటి సంవత్సరంగా దాకా ఏడాదికి రూ.6,500 కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల దాకా ఉండేది. అది ఈ ఏడాది రూ.3,500 కోట్లకు పడిపోయింది!! కోచింగ్ సెంటర్లే కాదు.. విద్యార్థుల కోసం నిర్మించిన వేలాది హాస్టళ్లు సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కోటా నగరం మొత్తమ్మీదా ఇలా విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టళ్లు 4,500 దాకా ఉంటాయని అంచనా. ఒకప్పుడు విద్యార్థులతో నిండిపోయి కళకళలాడిన ఈ హాస్టళ్లన్నీ.. ఇప్పుడు 40-50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేక వెలవెలబోతున్నాయి. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని హాస్టళ్లు నిర్మించి వాటిని నడిపినవారు.. ఇప్పుడు విద్యార్థులు లేక, రాబడి రాక.. బ్యాంకులకు నెలవారీ చెల్లింపులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కిందటి సంవత్సరం దాకా నెలకు రూ.15 వేలు వసూలు చేసిన హాస్టళ్లు.. ఇప్పుడు రూ.9 వేలకే అన్ని సౌకర్యాలూ కల్పించడానికి సిద్ధమైనా పూర్తిగా నిండని పరిస్థితి నెలకొంది. అలాగే.. ఈ కోచింగ్ సెంటర్లపై ఆధారపడి జీవనం సాగించే జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలవారు, ఆటో డ్రైవర్లు, హోటళ్లు, మెస్‌ల యజమానులు, వాటిలో పనిచేసే సిబ్బంది.. ఇలా లక్షలాదిమందిపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే దుకాణాల అద్దెలు రూ.15 వేల నుంచి రూ.3 వేలకు పడిపోయాయి. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోటాకు విద్యార్థుల రాక తగ్గిపోయి ఆ ప్రభావం స్థానిక ఆర్థిక వ్యవస్థపై పడడంతో.. అక్కడి వ్యాపారులు ఐటీ పరిశ్రమపై దృష్టి సారించారు.
24
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం కోటాలో 2023లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఇది. 2022లో ఈ సంఖ్య 15 కాగా.. 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది చనిపోయారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా కోటాలోని కోచింగ్ సెంటర్లన్నీ మూతపడడంతో ఆ రెండేళ్లూ విద్యార్థులు క్షేమంగా ఉన్నారు.
అలా మొదలైంది..
1994లో.. కోటాలోని కోచింగ్‌సెంటర్లకు చెందిన 15 మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశం లభించడంతో ఆ నగరం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ఏడాది ఏకంగా 51 మంది ఐఐటీల్లో సీట్లు సాధించడంతో.. అందులో ఐదుగురు టాప్100లో చోటు సాధించారు. 2000 సంవత్సరంలో.. ఐఐటీల్లో సీట్లు సాధించిన టాప్-10లో ముగ్గురు (1, 2, 7 ర్యాంకులు) కోటా విద్యార్థులే కావడంతో.. అక్కడి కోచింగ్ సెంటర్లకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వెల్లువెత్తడం మొదలైంది.
Updated Date - Dec 26 , 2024 | 05:38 AM