విప్లవకారుల ఐక్యతే లక్ష్యంగా...
ABN, Publish Date - Dec 27 , 2024 | 06:05 AM
ఏప్రిల్ 22, 1969లో భారత విప్లవ అరుణతార సీపీఐ (ఎం–ఎల్) ఆవిర్భవించింది. భారత విప్లవోద్యమం ప్రారంభం నుంచి రెండు పాయలుగా విభజనకు గురైంది. మొదటి పాయకు చారు మజుందార్...
ఏప్రిల్ 22, 1969లో భారత విప్లవ అరుణతార సీపీఐ (ఎం–ఎల్) ఆవిర్భవించింది. భారత విప్లవోద్యమం ప్రారంభం నుంచి రెండు పాయలుగా విభజనకు గురైంది. మొదటి పాయకు చారు మజుందార్, సత్యనారాయణ సింగ్ నాయకత్వం వహిస్తే, రెండవ పాయకు దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి నాయకత్వం వహించారు. ఈ రెండు పాయలు అనేక విభజనలకు గురయ్యాయి. కొన్ని తెరమరగయ్యాయి. మరికొన్ని ఉనికి కాపాడుకునే స్థితిలో ఉన్నాయి. రెండు పాయల్లోని సత్యనారాయణ సింగ్, చండ్ర పుల్లారెడ్డి 1975లో ఒకే పార్టీగా ఏర్పడ్డారు. దీని కొనసాగింపే నేటి సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ. ఈ పార్టీలో కూడా వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ సెక్షన్లు చీలికలను సృష్టించాయి. ఈ చీలికలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీని ప్రభావితం చేయలేకపోయాయి. సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ 14 రాష్ట్రాలకు విస్తరించి విప్లవోద్యమాన్ని కొనసాగిస్తున్నది. ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాయుద్ధ పంథాకి చేరువ కావాలని ప్రకటించుకున్నది. మార్క్సిజం– లెనినిజం– మావో ఆలోచనా విధానం సిద్ధాంత ప్రాతిపదికగా, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని, దృఢ సంకల్పంతో సమరశీల పోరాటాలను అభివృద్ధిపరుస్తోంది.
నేడు ఆర్‌ఎస్‌ఎస్ అండతో బీజేపీ ప్రభుత్వం– ప్రజలను చీల్చే చర్యలకు, ఈతిబాధలకు గురిచేస్తున్నది. వారి హక్కులపై అణచివేతను కొనసాగిస్తోంది. కార్పొరేట్లకు చేయూతనిస్తూ, దేశంలో ఫాసిస్టు విధానాలను నెలకొల్పుతున్నది. ఈ చర్యలకు వ్యతిరేకంగా అన్ని శక్తులు సంఘటితమై పోరాడాలి. చీలికలను నివారించి, ఐక్యతను సాధించాలి. దీనిలో భాగంగానే దేశంలో పలు విప్లవ సంస్థలతో సీపీఐ(ఎం–ఎల్) న్యూడెమోక్రసీ చర్చిస్తున్నది. ఐక్యతకు వీలుకాని వివ్లవ సంస్థలతో ఐక్య సంఘటన, ఐక్య కార్యాచరణను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా సీపీఐ(ఎం–ఎల్) న్యూడెమోక్రసీ పేరిట కొనసాగుతున్న రెండు విప్లవ పార్టీలు, చర్చల అనంతరం 2024 ఏప్రిల్‌లో జరిగిన సీపీఐ(ఎం–ఎల్) న్యూడెమోక్రసీ మహాసభల డాక్యుమెంట్ల ప్రాతిపదికగా విలీనమవుతున్నాయి. రేపు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే సభలో ఈ రెండు పార్టీలు ఒకే పార్టీగా ఆవిర్భవిస్తున్నాయి.
పి. సూర్యం
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ
Updated Date - Dec 27 , 2024 | 06:05 AM