Andhra Pradesh: మాకు న్యాయం కావాలి: అంబటి, అవినాష్
ABN, Publish Date - Dec 03 , 2024 | 07:47 PM
వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ పోలీసు కమీషనర్ ను కలిశారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
విజయవాడ: వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ పోలీసు కమీషనర్ ను కలిశారు. సజ్జల భార్గవరెడ్డి డ్రైవర్ సుబ్బారావు విషయంలో తగిన న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సజ్జల భార్గవరెడ్డి వద్ద సుబ్బారావు అనే డ్రైవర్ ఐదేళ్లుగా పని చేస్తున్నాడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సజ్జల భార్గవ్ రెడ్డిని టార్గెట్ చేసి కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆగిరిపల్లి వద్ద సింహాద్రి అప్పన్న పేట గ్రామంలో నివాసం ఉంటున్న సుబ్బారావు ఇంటికి పోలీసులు మఫ్టీలో వెళ్లి.. సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన విషయాలు చెప్పాలని అడిగారని అయితే, తనకు తెలియదని చెప్పినా వినకుండా పోలీసులు అతన్ని బలవంతంగా తీసుకువెళ్లారని అన్నారు.
సుబ్బారావును విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు ఒక అపార్టుమెంట్ లో ఉంచి ముసుగు వేసి కొట్టినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న సుబ్బారావును ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లారని.. ఈ ఘటనపై విచారణ చేసి న్యాయం చేయాలని పోలీసు కమీషనర్ ని కలిసినట్లు తెలిపారు. విజయవాడలో గౌతమ్ రెడ్డిపై సెక్షన్ 307 వేశారని, వారి ఇంట్లో ఏ విధంగా పోలీసులు ప్రవేశించారో వీడియోలు రికార్డు అయ్యాయని తెలిపారు. కడపలో రవీంద్రను పోలీసులు కొట్టారని తెలిపారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి కొడుతున్నారని ఆరోపించారు. వీటన్నింటిపైనా తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులపై న్యాయస్థానాల్లో కేసులు వేస్తామని వ్యాఖ్యానించారు.
Updated Date - Dec 03 , 2024 | 07:47 PM