రూ.1.7 కోట్ల ఉపాధి నిధులు స్వాహా
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:08 PM
ఉపాధి హామీ పథకం పనుల్లో రూ.1.7 కోట్ల నిధులు స్వాహా చేసినట్టు సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడింది. పనులు చేయకుండా నిధులు కాజేసిన ఏపీవో, టీఏ, సీవోల నుంచి రికవరీ చేయాలని డ్వామా అధికారులు ఆదేశించారు.
ప్రజావేదికలో బయటపడిన అక్రమాలు
పనులు చేయకుండా నిధులు డ్రా చేసిన వైనం
ఏపీవో, టీఏ, సీవోల నుంచి రికవరీకి ఆదేశం
చింతపల్లి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పనుల్లో రూ.1.7 కోట్ల నిధులు స్వాహా చేసినట్టు సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడింది. పనులు చేయకుండా నిధులు కాజేసిన ఏపీవో, టీఏ, సీవోల నుంచి రికవరీ చేయాలని డ్వామా అధికారులు ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ మైదానంలో సామాజిక తనిఖీపై డ్వామా పీడీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మండలంలో ఈజీఎస్, పంచాయతీరాజ్, ఐటీడీఏ, ఎస్‌ఎస్‌ఏ, ఇరిగేషన్ శాఖల్లో 3,020 పనులు జరిగాయి. ఈ పనులకు సంబంధించి రూ.21,55,61,228 కూలి రూపంలోనూ, రూ.12,08,36,567 మెటీరియల్ ఖర్చుగా నగదు చెల్లింపులు జరిగాయి. ఈ మేరకు 15వ రౌండ్ సామాజిక తనిఖీలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు డీఆర్‌పీలు గ్రామాలను సందర్శించి ఉపాధి హామీ పథకం పనులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. డీఆర్‌పీల తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. ప్రధానంగా కొమ్మంగి, కొత్తపాలెం, కుడుముసారి, లోతుగెడ్డ, ఎర్రబొమ్మలు, అన్నవరం పంచాయతీల పరిధిలో ఎవెన్యూ ప్లాంటేషన్(రహదారికి ఇరువైపుల మొక్కలు) నాట్లు వేసినట్టు, మొక్కలకు రక్షణగా కంచె కట్టినట్టు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.ఆరు లక్షల నిధులను కాజేసినట్టు రుజువైంది. పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకుండానే నిధులను డ్రా చేసుకున్నారు. ప్రధానంగా బలపం, లోతుగెడ్డ, గొందిపాకలు పంచాయతీల పరిధిలో ఉపాధి పనుల నేమ్ బోర్డులు పేరిట సుమారు రూ.8 లక్షల నిధులు డ్రా చేసుకున్నారు. కిటుముల పంచాయతీ కేంద్రంలో గిరిజన రైతులు పేరిట రెండు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు సాగు చేస్తున్నట్టు తప్పుడు పత్రాలు చూపించి రూ.2.5 లక్షల నిధులు మార్చుకున్నారు. దీంతో తక్షణమే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటాలని, నిధులను వెంటనే ఎఫ్‌ఏ, టీఏ, ఏపీవోల నుంచి రికవరీ చేయాలని డ్వామా పీడీ ఆదేశించారు. అన్నవరం పంచాయతీలోరెండు ఐటీడీఏ సీసీ రోడ్లు నిర్మించకుండా తప్పుడు రికార్డు నమోదు చేసి రూ.ఆరు లక్షల నిధులను కాంట్రాక్టర్ల ఖాతాలోకి జమచేశారు. అలాగే చౌడుపల్లి పంచాయతీలో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో ఒక సీసీ రోడ్డు పనులు చేపట్టకుండా రూ.1.9 లక్షల నిధులను ఉపాధి సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకున్నారు. ఈ నిధులను వెంటనే రికవరీ చేయాలన్నారు. బలపం పంచాయతీలో ఐటీడీఏ సీసీ రోడ్డు నిర్మాణంలో 600 మీటర్లు తక్కువగా నిర్మించి రూ.తొమ్మిది లక్షల నిధులను దోచేశారు. ఉపాధి పనుల కొలతల్లో భారీ తేడాలు, లబ్ధిదారుల సంతకాలు, వేలిముద్రలు లేకుండా వేతనాల చెల్లింపులు జరిగాయి. ఆశ కార్యకర్తలకు ఉపాధి పని కల్పించినట్టు వేతనాలు చెల్లించారు. ప్రజావేదికలో రుజువైన అక్రమాలపై ఏపీవో, టీఏ, సీవోల నుంచి నిధులను రికవరీ చేయాలని డ్వామా పీడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీవీవో నిర్మలాదేవి, ఎంపీపీ కోరాబు అనుషదేవి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాసరావు, ఎస్‌ఆర్‌పీ కె.వెంకటరమణ, ఏపీవోలు రాజు, కొక్కుల లక్ష్మీనారాయణ, కొండబాబు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 11:08 PM