మెకానికల్ మాయాజాలం
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:56 AM
జీవీఎంసీ మెకానికల్ విభాగంలో కొంతమంది అధికారులు...కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాహనాల రిపేరు పేరుతో అడ్డగోలుగా నిధులను స్వాహా చేస్తున్నారు.
జీవీఎంసీలో వాహనాల మరమ్మతు పేరిట ప్రజా ధనం దుర్వినియోగం
ఎనిమిదేళ్ల కిందట కొనుగోలు చేసిన వాహనాల రిపేరుకు రూ.17 లక్షల చొప్పున ఖర్చు
మెకానికల్ టెక్నికల్ అడ్వయిజర్ బంధువు షెడ్‌లో మరమ్మతులు
రెండు నెలలు తిరగకుండానే మళ్లీ మొరాయింపు
కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ మెకానికల్ విభాగంలో కొంతమంది అధికారులు...కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాహనాల రిపేరు పేరుతో అడ్డగోలుగా నిధులను స్వాహా చేస్తున్నారు. మరో రెండేళ్లలో జీవితకాలం ముగిసిపోయే వాహనాలకు రిపేర్లు కోసం రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. అవి రెండు నెలలు తిరగకుండానే తిరిగి షెడ్డుకు చేరుతున్నాయి. రిపేర్లకు ఖర్చుపెట్టే మొత్తానికి మరికొంత కలిపి కొత్త కొనుగోలు చేస్తే ఐదారేళ్ల వరకూ ఎలాంటి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు.
నగరంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణతోపాటు వాటిని ఆయా జోన్‌లోని చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు(ఎంఎస్‌ఎఫ్)లకు తరలించడం, అక్కడ నుంచి కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించడం కోసం 675 క్లాప్ వాహనాలు కాకుండా మరో 252 వాహనాలు ఉన్నాయి. ఆ 252 వాహనాల్లో కొన్ని 14 సీఎంటీ కాంపాక్టర్లు 15 కాగా మిగిలినవి క్లోజ్డ్ కాంపాక్టర్ కంటెయినర్లు, తారాస్ లారీలు, టిప్పర్లు వంటివి ఉన్నాయి. 14 సీఎంటీ సామర్థ్యం కలిగిన కాంపాక్టర్ వాహనాలను జీవీఎంసీ దాదాపు ఎనిమిదేళ్ల కిందట కొనుగోలు చేసింది. వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (డ్రైవర్, ఇంధనం, రిపేర్లు) బాధ్యతలను టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. దీనికోసం ఏటా సుమారు రూ.40 లక్షల వరకు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. ఏడాదికాలానికి టెండర్లు అప్పగించినప్పుడు వాహనాన్ని కాంటాక్టర్ ఏ కండీషన్‌లో తీసుకుంటున్నారో...ఏడాది తర్వాత అదే కండీషన్‌లో అప్పగించాలి. ఒకవేళ టైర్లు అరిగిపోయినా, ఇంజన్ రిపేరు ఉన్నా, ఇతర నిర్వహణ లోపాలు ఉన్నా రిపేరు చేయించడానికి అయ్యే మొత్తాన్ని సదరు కాంట్రాక్టర్ బిల్లు నుంచి జీవీఎంసీ మినహాయించి కొత్త కాంట్రాక్టర్‌కు అందజేయాల్సి ఉంటుంది. అయితే మెకానికల్ విభాగం అధికారులు వాహనాల నిర్వహణ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) టెండర్లు పిలిచినప్పుడు ఆ విషయాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో ఎనిమిదేళ్ల కిందట కొనుగోలు చేసిన 14 సీఎంటీ కాంపాక్టర్ వాహనాలు మూలకు చేరిపోయాయి. ఆయా వాహనాల జీవితకాలం మరో రెండేళ్లు మాత్రమే ఉన్నప్పటికీ అధికారులు మాత్రం వాటికి రిపేరు చేయించి తిరిగి రోడ్డుపై తిప్పాలని నిర్ణయించారు.
రూ.17 లక్షలతో మరమ్మతు చేయిస్తే...
14 సీఎంటీ కాంపాక్టర్లు పదిహేను కూడా మరమ్మతులకు గురవడంతో అధికారులు రిపేర్లకు టెండర్లు పిలిచారు. ఒక్కో వాహనానికి రూ.17 లక్షల ఖర్చుతో రిపేర్లు చేసేలా నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారు. వీటిలో ఏడు వాహనాలు మరమ్మతులు పూర్తిచేసుకుని రెండు నెలల కిందట జీవీఎంసీకి చేరాయి. వీటి నిర్వహణకు కొత్తగా టెండర్లు పిలవడంతో వేర్వేరు వ్యక్తులు టెండర్ దక్కించుకున్నారు. అయితే రూ.17 లక్షలు ఖర్చుపెట్టిన వాహనాల ఇంజన్‌లు మొరాయిస్తుండడంతో వాటి నిర్వహణ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు రిపేర్లు చేయించుకుంటున్నారు. అయితే ఒక వాహనం ఇంజన్ బాగా దెబ్బతినడంతో దానికి రూ.నాలుగు లక్షలకు పైగా ఖర్చు అవుతుందని మెకానిక్ అంచనా వేయడంతో సదరు కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో మెకానికల్ అధికారులే ఆ వాహనాన్ని జ్ఞానాపురంలోని ఒక ప్రైవేటు గ్యారేజీకి పంపించి రిపేరు చేయించే బాధ్యతను తీసుకున్నారు. కొత్తవాహనం ఖరీదు సుమారు రూ.50 లక్షలు ఉంటుందని, మూలకు చేరిన వాహనానికి రూ.20 లక్షలు వెచ్చించి రిపేరు చేసినా మరో రెండేళ్లకు మించి తిరగదని తెలిసి కూడా అధికారులు రూ.కోట్లు ఖర్చుపెట్టడం ఏమిటని జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వీవీ వామనరావు ప్రశ్నించారు. రిపేర్లకు ఖర్చుపెట్టే డబ్బుకి మరో రూ.30 లక్షలు ఖర్చుపెడితే కొత్తవాహనం వచ్చేస్తుందని, కొత్తవాహనానికి కనీసం ఐదేళ్లు రిపేర్లు లేకుండా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల చెత్తసేకరణ, తరలింపులో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పనిచేయవచ్చునన్నారు.
మెకానికల్ టెక్నికల్ అడ్వైజర్ ఏంచేస్తున్నారో మరి:
జీవీఎంసీ మెకానికల్ విభాగంలో వాహనాల రిపేర్లలో అక్రమాలకు చోటులేకుండా పారదర్శకంగా అంచనాలు తయారుచేసేందుకు వీలుగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఒకరిని టెక్నికల్ అడ్వయిజర్‌గా నియమించారు. సుమారు రూ.50 వేలు గౌరవ వేతనంతోపాటు ఒక కారు, డ్రైవర్, నెలకు 200 లీటర్లు ఇంధనం జీవీఎంసీ ఇస్తోంది. ఎనిమిదేళ్ల జీవితకాలం పూర్తయిన 15 వాహనాలను దాదాపు రూ.17 లక్షలు చొప్పున ఖర్చు పెట్టి మరమ్మతు చేయించాలని సదరు అడ్వయిజర్ సూచించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆ వాహనాల రిపేర్లు కూడా విజయవాడలో తనకు తెలిసిన వ్యక్తి గ్యారేజీలోనే చేయించాలని షరతు పెట్టినట్టు సమాచారం.
Updated Date - Dec 27 , 2024 | 12:56 AM