నగరంలో లులు మాల్!
ABN, Publish Date - Sep 30 , 2024 | 01:01 AM
నగరంలో లులు మాల్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో శనివారం లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ కావడం ప్రత్యేకత సంతరించుకుంది.
తాజాగా సీఎం చంద్రబాబుతో సంస్థ అధినేత భేటీ
నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం
రూ.2,200 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదన
వైసీపీ ప్రభుత్వ చర్యలతో పారిపోయిన దిగ్గజ సంస్థ
కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక
ప్రస్తుతం 13.83 ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
సుమారు 15 వేల మందికి ఉపాధి లభించే అవకాశం
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
నగరంలో లులు మాల్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో శనివారం లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం పునరుద్ధరిస్తారని, ఇందులో భాగంగా మాల్ నిర్మాణానికి చర్యలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు. రూ.వేల కోట్లతో మాల్ నిర్మాణం పూర్తైతే సుమారు 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉండగా 2018లో బీచ్‌రోడ్డులోని 13.83 ఎకరాల్లో భారీ మాల్ నిర్మాణానికి లులు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఏపీఐఐసీకి చెందిన 11.23 ఎకరాలు, సీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉన్న ప్రాంతం 2.60 ఎకరాలు వెరసి 13.83 ఎకరాల్లో మాల్, కన్వెన్షన్ సెంటర్, ఇతర వ్యాపార సంస్థల ఏర్పాటుకు అప్పట్లో రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు లులు సంస్థ ప్రతిపాదించింది. మాల్ నిర్మాణంతో సుమారు పది వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. ఇందుకు ఏపీఐఐసీ స్థలానికి ఆనుకుని ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌ను ఇచ్చేలా సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణను అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పించారు. ఈ స్థలానికి బదులుగా నగరంలో కొన్నిచోట్ల సీఎంఆర్‌కు ప్రభుత్వ స్థలాలను బదలాయించారు. దీంతో మాల్ ఏర్పాటుకు డిజైన్లు రూపొందించి, శంకుస్థాపన ప్రక్రియను కూడా పూర్తిచేశారు.
వైసీపీ నిర్ణయాలతో వెనక్కి
కాగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. లులు మాల్‌కు భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే నెపంతో రివర్స్ టెండరింగ్ పేరిట, టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అడ్డగోలుగా రద్దుచేశారు. దీంతో లులు గ్రూప్ రాష్ట్రం నుంచి తరలిపోయింది. తమిళనాడు, తెలంగాణ, కేరళలో భారీ మాల్స్ ఏర్పాటుచేసింది. అయితే విశాఖలో మాల్ నిర్మాణానికి కేటాయించిన భూమి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అందులో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఆసక్తి గల సంస్థలు ముందుకు రావాలని గత వైసీపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించి, అడుగు రూ.6,500 చొప్పున విక్రయించి, ప్రభుత్వానికి జమ చేయాలని పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనకు కనీస స్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో లులు మాల్‌కు కేటాయించిన స్థలంతో పాటు గాజువాక సమీపాన ఉన్న అగంనపూడి, ఫకీర్‌తకియాల్లో మూడు ఎకరాలు కలిపి మొత్తం రూ.1,465 కోట్లకు భూములను అమ్మకానికి పెట్టింది. ఇందులో బీచ్ రోడ్డులోని 13.83 ఎకరాలకు రూ.1,452 కోట్లుగా విలువ నిర్ణయించింది.
ముందుకు రాని సంస్థలు
వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడంతో భూముల అమ్మకానికి కూడా స్పందన లభించలేదు. రాష్ట్రంలో తిరిగి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లులు సంస్థ ఏర్పాటుకు కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం సంస్థ చైర్మన్ ముఖ్యమంత్రిని కలిసి చర్చించడంతో మాల్ ఏర్పాటుకు ప్రాతిపాదించారని సమాచారం. ఐదేళ్ల క్రితం చేసుకున్న ప్రతిపాదనలను ప్రభుత్వం పునరుద్ధరించే అవకాశం ఉన్నందున పెట్టుబడుల విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
15 వేల మందికి ఉపాధి
నగరంలో లులు మాల్ ఏర్పాటైతే సుమారు 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఐదు వేల సీటింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, సుమారు ఎనిమిది మల్టీప్లెక్స్ థియేటర్లు, హైపర్ మార్కెట్, ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌తో పాటు ఇతర వసతులు కల్పించేలా మాల్ నిర్మాణం చేపడతారని సమాచారం. ఇందులో భాగంగా సంస్థ ప్రతినిధులు త్వరలో విశాఖ వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత గతంలో రద్దైన ఒప్పందం పునరుద్ధరణ, తదితర అంశాలపై చర్యలు వేగవంతం కానున్నాయని తెలిసింది.
Updated Date - Sep 30 , 2024 | 08:14 AM