భూముల విలువ సవరణ
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:27 AM
విశాఖ జిల్లాలో భూముల విలువల సవరణకు జాయింట్ కలెక్టర్ కమిటీకి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సమర్పించింది.
ఒకటో తేదీ నుంచి అమలుకు రంగం సిద్ధం
జాయింట్ కలెక్టర్ కమిటీకి స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ప్రతిపాదనలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శన
అభ్యంతరాలు ఉన్నట్టయితే రెండు రోజుల్లోగా రాత పూర్వకంగా తెలియజేయాలి
రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ రేటుకు ఎక్కువ తేడాలున్న చోట 50 శాతం వరకూ పెంపు
వుడా రెవెన్యూ లేఅవుట్‌లో 22 శాతం
ఎంవీవీ సిటీలో 10 శాతం
బక్కన్నపాలెం 20 శాతం
ఒమ్మివానిపాలెం 67 శాతం
సాయిప్రియా లేఅవుట్ 26 శాతం
అక్కయ్యపాలెంలో 9 శాతం
కాపులుప్పాడలో 19 శాతం
ముడసర్లోవ ప్రాంతంలో 43 శాతం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ జిల్లాలో భూముల విలువల సవరణకు జాయింట్ కలెక్టర్ కమిటీకి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి తేవాలని ఆదేశించడంతో ప్రతి గ్రామం తిరిగి ధరలు, అక్కడి అభివృద్ధి పరిశీలించారు. ఆ మేరకు రెవెన్యూ, జీవీఎంసీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని కలిసి కొత్త ధరలు ప్రతిపాదించారు. ఎక్కడైతే కొత్తగా లేఅవుట్లు, నిర్మాణాలు వస్తున్నాయో అక్కడ మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని రేట్లు నిర్ణయించారు. వీటిని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో రాతపూర్వకంగా సబ్ రిజిస్ట్రార్‌కు తెలియజేయాలి. జిల్లా కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల నుంచి అందిన ప్రతిపాదనలు పరిశీలిస్తే అత్యల్పంగా ఐదు శాతం అత్యధికంగా 131 శాతం విలువలను సవరించారు.
ఆనందపురం మండలం శిర్లపాలెంలో గజం భూమి ప్రభుత్వ ధర (రిజిస్ర్టేషన్ వాల్యూ) కేవలం రూ.650 మాత్రమే ఉంది. మార్కెట్ విలువ రూ.2 వేలు ఉంది. దానిని ఇప్పుడు రూ.1,500 చేశారు. శాతంలో చూసుకుంటే మాత్రం 131శాతం పెంచినట్టు కనిపిస్తోంది. అదే అక్కయ్యపాలెం, నరసింహనగర్, అబిద్ నగర్‌లను తీసుకుంటే ప్రభుత్వ ధర గజం రూ.70 వేలు ఉండగా, మార్కెట్ విలువ రూ.1.25 లక్షలు ఉంది. దీనిని ఇప్పుడు 9 శాతం అంటే రూ.6 వేలు పెంచి రూ.76 వేలు చేశారు.
- అడవివరం సింహగిరి కాలనీలో గజం ప్రభుత్వ ధరరూ.20 వేలు కాగా మార్కెట్ విలువ రూ.38,500 ఉంది. దీనిని 15 శాతం పెంచి రూ.23 వేలు చేశారు.
- నాయుడుతోటలో గజం రూ.24 వేలు కగా మార్కెట్ రేటు 45 వేలు ఉంది. దీనిని 12.5 శాతం పెంచి రూ.27 వేలు చేశారు.
- చీమలాపల్లిలో గజం రూ.12 వేలు కాగా మార్కెట్ విలువ రూ.22,500 ఉంది. దానిని 12.5 శాతం పెంచి రూ.13,500 చేశారు.
- కాకానినగర్‌లో గజం రూ.40 వేలు ఉండగా, మార్కెట్ రేటు రూ.75 వేలు పలుకుతోంది. దీనిని 12.5 శాతం పెంచి 45 వేలు చేయాలని ప్రతిపాదించారు.
- పీఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా ఎంవీవీ సిటీలో గజం స్థలం రూ.40 వేలు కాగా మార్కెట్ రేటు రూ.70 వేలు ఉంది. దీనిని 10 శాతం పెంచి రూ.44 వేలు చేశారు. అక్కడ ఫ్లాట్ కొంటే చ.అడుగు ధర రూ.4 వేలు ఉండగా మార్కెట్ విలువ రూ.7 వేలు పలుకుతోంది. దాంతో 5 శాతం పెంచి రూ.4,200 చేశారు.
- మధురవాడ వుడా రెవెన్యూ లేఅవుట్‌లో గజం ధర రూ.45 వేలు కాగా మార్కెట్ విలువ రూ.90 వేలు పలుకుతోంది. దాంతో 22 శాతం పెంచి రూ.55 వేలు చేశారు.
- చంద్రపాలెంలో గజం ధర రూ.30 వేలు కాగా మార్కెట్ రేటు రూ.55 వేలు పలుకుతోంది. 10 శాతం పెంచి రూ.33 వేలు చేశారు.
- సాయిప్రియా లేఅవుట్‌లో గజం రూ.35 వేలు కాగా మార్కెట్ రేటు రూ.60 వేలు ఉంది. దానిని 22 శాతం పెంచి రూ.44 వేలు చేశారు.
- బక్కన్నపాలెంలో గజం రూ.20 వేలు కాగా మార్కెట్ రేటు రూ.40 వేలు ఉంది. దీనిని 20 శాతం పెంచి రూ.24 వేలు చేశారు.
- ఒమ్మివానిపాలెం (వాడపాలెం)లో గజం ధర రూ.18 వేలు కాగా మార్కెట్ ధర రూ.50 వేలు ఉంది. దాంతో 67 శాతం పెంచి రూ.30 వేలు చేశారు.
- గుడ్లవానిపాలెంలో గజం ధర రూ.24 వేలు కాగా మార్కెట్ రేటు రూ.50 వేలు ఉంది. 38 శాతం పెంచి రూ.33 వేలు చేశారు.
- ఆనందపురం మండలం పాలవలసలో వుడా అప్రూవల్ లేఅవుట్‌లో గజం రూ.3,700 ఉండగా మార్కెట్ రేటు రూ.8 వేలు ఉంది. దానిని 62 శాతం పెంచి రూ.6వేలు చేశారు.
- బోని గ్రామంలో గజం ధర రూ.950 మాత్రమే ఉంది. మార్కెట్ రేటు రూ.2 వేలు కాగా 58 శాతం పెంచి రూ.1,500 చేశారు.
- పద్మనాభం మండలం అమనాంలో ఎకరా భూమి ధర రూ.45 లక్షలు కాగా మార్కెట్ రేటు రూ.90 లక్షలు ఉంది. దీనిని 33 శాతం పెంచి రూ.60 లక్షలు చేశారు.
- చేపలుప్పాడలో ఎకరా ధర రూ.1.3 కోట్లు కాగా మార్కెట్ రేటు రూ.2.7 కోట్లు ఉంది. దీనిని 23 శాతం పెంచి రూ.1.6 కోట్లుకు ప్రతిపాదించారు.
- దాకమర్రిలో ఎకరా రూ.1.2 కోట్లు కాగా మార్కెట్ రేటు రూ.2.3 కోట్లు ఉంది. దానిని 23 శాతం పెంచి రూ.1.6 కోట్లు చేశారు.
Updated Date - Dec 21 , 2024 | 12:28 AM