జల్ జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం వద్దు
ABN, Publish Date - Dec 31 , 2024 | 11:23 PM
ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీటి అందించే జల్ జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచించారు.
ఏజెన్సీలో శిశు మరణాలపై ఉన్నతాధికారులతో కమిటీ వేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
పాడేరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీటి అందించే జల్ జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచించారు. జిల్లాలోని అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా 2 లక్షల 38 వేల 319 ఇళ్లకు కుళాయిల ద్వారా నీళ్లు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనుల్లో ప్రస్తుతం లక్షా 20 వేల 931 ఇళ్లకు మాత్రమే కుళాయిలను ఏర్పాటు చేశారని, మిలిగిన లక్షా 17 వేల 388 ఇళ్లకు త్వరితగతిన కుళాయిలు సమకూర్చాలన్నారు. అలాగే రిజర్వాయర్ల ద్వారా నీటిని గ్రామాలకు అందించే అవకాశాలపై డీపీఆర్ రూపొందించాలని, విద్యుత్ మోటార్ల మరమ్మతులపై యువతకు నైపుణ్య శిక్షణ అందించాలన్నారు.
శిశు మరణాలపై ఉన్నతాధికారులతో కమిటీ వేయాలి
ఏజెన్సీలో శిశు మరణాలకు గల కారణాలపై అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారులతో కమిటీని వేయాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ను కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. పలు ప్రాంతాల్లో అనారోగ్యానికి గురవుతున్న శిశువులకు పలువురు పసరు మందులు వేస్తుండడంతో మృత్యువాత పడుతున్నారని పలువురు డాక్టర్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన దానిపై అధ్యయనం చేసేందుకు వైద్యులు, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆస్పత్రుల పనితీరు మెరుగుపడాలన్నారు. అలాగే వారపు సంతల్లో నకిలీ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, ప్రజలకు నకిలీ వస్తువుల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తున్న సరకుల నాణ్యతను పరిశీలించాలని, అవి సక్రమంగా లేకుంటే టెండర్‌దారుడ్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు. జిల్లాలో స్వర్ణ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా 90 శాతం ఇంటిపన్నులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి డీపీవో లవరాజును అభినందించారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని, నీటి ట్యాంకుల క్లోరినేషన్ పక్కాగా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఏడాది రెండో తేదీన చట్టప్రకారం నిర్వహించాల్సిన గ్రామసభల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీల పీవోలు అభిషేక్, సింహాచలం, అపూర్వభరత్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ జమాల్ బాషా, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 11:23 PM