కవులు, భాషావేత్తల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:52 AM
‘రాష్ట్రంలో తెలుగు భాష కోసం పనిచేసిన కవులు, భాషావేత్తల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. ’ అని ముగింపు సభలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.
ప్రపంచ తెలుగురచయితల ముగింపు సభలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
విజయవాడ కల్చరల్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో తెలుగు భాష కోసం పనిచేసిన కవులు, భాషావేత్తల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. వైసీపీ ప్రభుత్వం కళాకారులకు రూ.5కోట్లు బకాయిలు పెట్టింది. వాటిని విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కళాకారులకు ఇచ్చే పెన్షన్‌ను పెంచాలి. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలి.’ అని ముగింపు సభలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. నన్నయ 11వ శతాబ్దంలో తెలుగులోకి భారతాన్ని అనువదించేటప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడో అదే పరిస్థితి ఇప్పుడు ఉందని, పదసంపద సృష్టికి తగినంత కృషి జరగాలని సాంస్కృతిక శాఖ మాజీ సంచాలకుడు విజయభాస్కర్ అన్నారు. పూర్వం గ్రామాల్లో ప్రదర్శించిన నాటకాల్లో ప్రయోగించిన పద్యాలు నేటికీ ప్రజల నాలుకలపై ఆడుతున్నాయని, ఇప్పుడు సామాజిక ఇతివృత్తంతో పద్య నాటకాలను తీసుకొస్తే భాష సజీవంగా నిలుస్తుందని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ముగింపు సభలో కొలకలూరి ఇనాక్, అధికార భాషా సంఘం సభ్యుడు కత్తి వెంకటేశ్వర్లు, సిలికానాంధ్ర ప్రతినిధి చామర్తి రాజు, ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, కార్యదర్శి జీవీ పూర్ణచందు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 12:52 AM