‘కూచిపూడి’కి ఆదరణ కొరవడడం బాధాకరం
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:55 AM
కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ఆదివారం మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
నాట్యకళ అభివృద్దికి కృషి చేద్దాం..స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో మంత్రి కందుల దుర్గేశ్
కూచిపూడి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ చరిత్రలో ఊరు పేరుపై ఉన్న ఏకైక నాట్యకళ కూచిపూడి. ప్రపంచ దేశాలను కూచిపూడి నాట్యం ఆకట్టుకుంటోంది. ఏపీలో ఈ కళకు ఆదరణ కొరవడడం బాధకరం.’ అని సాంస్కృతిక, పర్యాటక శాఖ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 50 వసంతాల పతాక స్వర్ణోత్సవాల సందర్భంగా 50 అడుగుల ఏకశిల పతాక స్థూపాన్ని ఏర్పాటు చేయడం అద్భుతమని మంత్రి పేర్కొన్నారు. కూచిపూడి నాట్యానికి ఆదరణ పెం చేందుకు కళాకారులు కార్యాచరణతో ముందుకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో చర్చిద్దామని ఆయన సూచించారు. కూచిపూడి నాట్యం అనే దీపాన్ని దేదీప్యమానంగా వెలుగొందేలా అందరూ చేయీచేయీ కలిపి కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
భాషను, సంస్కృతినీ అంతం చేసే ప్రభుత్వాన్ని చూశాం
వైసీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చురకలు
ఇంతకు ముందు భాషను, సంస్కృతిని అంతం చేసే ప్రభుత్వాన్ని చూశామని గత వైసీపీ ప్రభుత్వానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చురకలు వేశారు. నేడు కళను ఆదరించే ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి మరింత అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాట్య పతాక స్థూపం ఆవిష్కరించటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తెలుగువారి జీవనాడి కూచిపూడి అని, సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ నాట్యకళ నేటికీ సజీవంగా ఉండడం మంచి పరిణామమని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఈ సంస్కృతిని నిలబెడుతూ భావితరాలకు అందిస్తున్న కళాకారులు అభిన ందనీయులన్నారు. అంతకు ముందు శ్రీ సిద్ధేంద్ర కళాపీఠంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ గ్యాలరీని మంత్రులు తిలకించారు. కళాపీఠం ఆవరణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కళాపీఠం సమీపంలో ఏర్పాటు చేసిన నాట్య పతాక స్థూపాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆవిష్కరించారు.
ప్రతి గ్రామంలో కళాక్షేత్రం ఉండాలి: మంత్రి కొల్లు రవీంద్ర
ప్రతి గ్రామంలో కూచిపూడి కళాక్షేత్రం ఉండాలని, కూచిపూడి నాట్య కళపై మక్కువ పెంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కూచిపూడి కళాకారులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తదనంతో కూచిపూడిని ముందుకు తీసుకెళ్తానన్నారు. కూచిపూడి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చిస్తానని మంత్రి రవీంద్ర హామీ ఇచ్చారు.
ఫొటో ఎగ్జిబిషన్ గ్యాలరీని ప్రారంభిస్తున్న మంత్రి కందుల దుర్గేశ్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
Updated Date - Dec 30 , 2024 | 12:55 AM