అంగరంగ వైౖభవంగా స్వర్ణ రథోత్సవం
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:39 PM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
మంత్రాలయం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం ధనుర్మాసం షష్టి శుభ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగారు,వెండి, పట్టువస్ర్తాలు, బెంగళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణ రథంపై వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి, పీఠాధిపతి మహ మంగళహారతులు ఇచ్చి రథంపై నుంచి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. అంతకు ముందు పీఠాధిపతి మూలరాములు, జయరాములు, దిగ్విజయ రాములకు స్వర్ణ నాణేలతో అభిషేకం చేసి మహా మంగళ హారతులు ఇచ్చి భక్తులను పీఠాధిపతి ఆశీర్వదించారు.
రాఘవేంద్రున్ని సన్నిధిలో రామప్రియతీర్థులు
రాఘవేంద్రస్వామి దర్శనార్థం బాలాఘర్ అక్షోభ్య మఠం పీఠాధిపతి రామప్రియతీర్థులు శనివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. పీఠాధిపతికి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి మఠాల అభివృద్ధిపై చర్చించారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఇరువురు పీఠాధిపతులు శాలువు, పూలమాలలతో ఘనంగా సత్కరించుకున్నారు. కార్యక్రమంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేశ జోషి, శ్రీపతాచార్, ఐపీ నరసింహమూర్తి, జయతీర్థాచార్, నరసింహ దేశాయ్, అనంతపురాణిక్, ద్వారపాలక అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు.
మఠం గోశాలకు రూ.లక్ష విరాళం
రాఘవేంద్రస్వామి మఠానికి మైసూరుకు చెందిన దేవపాల్ అనే భక్తుడు రూ.లక్ష విరాళం ఇచ్చినట్లు ఏఏవో మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్ జోషి తెలిపారు. శనివారం కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఆయన గోశాలకు నగదును విరాళం ఇచ్చినట్లు తెలిపారు. దాత కుటుంబానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫల,పుష్ప, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.
Updated Date - Dec 21 , 2024 | 11:39 PM