నేటినుంచి 6వతేదీ వరకు గ్రామసభలు
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:01 AM
అభయహస్తం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలును ప్రారంభించింది. ఈ క్రమంలోనే మిగిలిన గ్యారెంటీ పథకాల అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం నుంచి
ఖమ్మం కలెక్టర్ ఫొటో
రైౖటప్: 27 కేజీఎం 02 మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ప్రియాంక అల
‘ప్రజాపాలన’కు సర్వంసిద్ధం
‘అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు
ప్రతీ వంద కుటుంబాలకు ఒక కౌంటర్
ఆధార్, రేషనకార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటో చాలు..
ఖమ్మం / కొత్తగూడెం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ ఖమ్మం కలెక్టరేట్, డిసెంబరు 27 : అభయహస్తం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలును ప్రారంభించింది. ఈ క్రమంలోనే మిగిలిన గ్యారెంటీ పథకాల అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం నుంచి వచ్చేనెల 6వతేదీ వరకు ప్రతీ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. రశీదు అందించనుంది. అయితే గురువారం జిల్లాకు చెందిన మంత్రులు నాగపూర్‌లో జరిగే కాంగ్రెస్ సభకు తరలివెళుతున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని ఇరు జిల్లాల కలెక్టర్లు ప్రారంభించనున్నారు. ఇక ప్రభుత్వమే దరఖాస్తు ఫారాన్ని ముంద్రించి.. పంపిణీ చేయబోతోంది. దీని ద్వారా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించి వెంటనే రశీదు కూడా ఇవ్వనున్నారు.
దరఖాస్తు చేసుకునే పథకాలివీ..
గ్యారెంటీ పథకాలైన మహాలక్ష్మి (మహిళలకు నెలకు రూ.2500), గృహజ్యోతి (రూ.500 గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, ఇంటినిర్మాణానికి రూ.5లక్షల సాయం, నెలకు రూ.4వేల పింఛన, రైతు భరోసా (ఎకరానికి రూ.15వేలు). వీటికోసం ప్రజలు తమ దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. తొలుత అధికారులు, గ్రామపంచాయతీ స్థాయిలో సిబ్బంది, పట్టణాల్లో మెప్మా సిబ్బంది ఇంటింటికి తిరిగి దరఖాస్తులను అందిస్తారు. అవసరమైన సమయంలో గ్రామస్థాయిలో విలేజ్ బుక్ కీపర్లు, మెప్మా సిబ్బంది దగ్గరుండి దరఖాస్తులను నింపి ఇస్తారు. వీటికి ఆధార్ కార్డు, తెల్లరేషన కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోను జత చేసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అందించాలి. నేటినుంచి జనవరి 6లోపు ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
అర్జీల స్వీకరణకు అధికారులతో బృందాలు
గ్రామాల్లో, పట్టణాల్లోనూ ప్రతీ వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల్లో తహాసీల్దార్లు, ఎంపీడీవోలు, పట్టణాల్లో అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. ఒక వేళ తొలిరోజు దరఖాస్తు ఇవ్వడం జాప్యమైనా మరుసటి రోజున అదే కౌంటర్లలో దరఖాస్తులను అందించే సౌలభ్యం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ రేషన కార్డు లేకపోయినా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేయడంతో పాటు ఉద్యమ అమరులైన వారి కుటుంబాలు 250చదరపు గజాల ఇంటి స్థలం కోసం కుటుంబ వివరాలు, అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసుల్లో ఉన్న వారు దరఖాస్తులో వివరాలు ఇవ్వాలి. చేయూత పథకంలో వితంతువులు, ఒంటరిమహిళలు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు గీతకార్మికులు, కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటున్న వారు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉచితంగానే దరఖాస్తు ఫారాలు
ప్రజాపాలన కార్యక్రమంలో అందించే దరఖాస్తులను అధికారులే ఉచితంగా ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వమే వాటిని ముద్రించి పంపింది. ఖమ్మం జిల్లాకు బుధవారం 70 వేల దరఖాస్తు ఫారాలు రాగా.. గురువారం సాయంత్రానికి మరో 5లక్షల దరఖాస్తులు అందనున్నాయి. ఇక దరఖాస్తు చేసుకున్న రోజు సాయంత్రం రోజు నుంచే వచ్చిన దరఖాస్తులను ఆనలైనలో కంప్యూటరీకరిస్తారు. పంచాయతీ, పట్టణంలో వార్డు స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను ఏ రోజు కారోజు ఉన్నతాధికారులకు పంపించడంతో పాటు ఆనలైన చేస్తారు. కౌంటర్లలో మాత్రం దరఖాస్తులకు ఆ ఫారంలో అన్ని వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించి అవన్నీ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. వీటన్నింటినీ పొందు పరిచేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రతి దరఖాస్తుకు ఒక సంఖ్యను కేటాయించి ఆ తర్వాత విచారణ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.
ఇరు జిల్లాల్లో ఇలా..
ఖమ్మం జిల్లాలో 21 మండలాలు, 589గ్రామపంచాయతీలతో పాటు నాలుగు మునిసిపాలిటీల్లోని 125వార్డుల వారీగా గ్రామసభలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 3,80,947 కుటుంబాలు, 15,23,788మంది జనాభా ఉండగా.. దరఖాస్తుల స్వీకరణకు 59 బృందాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాలకు సంబంధించి 481 పంచాయతీలతో పాటు నాలుగు మున్సిపాలిటీలోని 104 వార్డులు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 3,17,434 కుటుంబాలు, 10,69,261 జనాభా ఉండగా.. దరఖాస్తుల స్వీకరణకు 59 బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రజాపాలన గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక అల
ప్రజల చెంతకే పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల కోరారు. ఈ మేరకు ఖమ్మం కలెక్టర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేయగా, భద్రాద్రి కలెక్టర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన సభల్లో దరఖాస్తు చేసుకునే ఫారాలను బుధవారం సాయంత్రానికే ప్రజలకు అందించామన్నారు. గురువారం నుంచి జనవరి 6వతేదీ వరకు గ్రామసభలను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షామియానాలు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతీ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. వార్డుల్లో నిర్వహించే గ్రామసభలపై ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. దరఖాస్తుతోపాటు రేషన, ఆధార్‌కార్డు జిరాక్స్, కుటుంబ పెద్ద పాస్ ఫొటో జత చేయాల్సి ఉంటుందన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
హరికిషన, ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి
పంచాయతీ కార్యాలయం, రైతు వేదికల వద్ద గ్రామసభల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేశాం. పంచాయతీ కార్యదర్శులు, అంగనవాడీ, ఐకేపీ సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతున్నాం.. పట్టణాల్లోనూ ఎంపిక చేసిన వేదికల వద్ద ఏర్పాట్లు చేశాం. ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోకుండా దరఖాస్తులను అందుబాటులో ఉంచుతున్నామని ఇంటికే దరఖాస్తు ను ముందు రోజే అందించనున్నామని నింపడానికి విలేజ్ బుక్ కీపర్లు, మెప్మాసిబ్బంది ఉంటారని కేవలం ఆధార్‌కార్డు, తెల్లరేషన కార్డు, ఒక పాస్‌పోర్టు సైజ్ ఫోటోను దరకాస్తుతో జత చేసి కౌంటర్లలో అందిస్తే రశీదు పొందాలని తెలిపారు.
నోడల్ అధికారిగా రఘునందనరావు
ప్రజాపాలన కార్యక్రమాల పర్యవేక్షణకు గాను ఉమ్మడిజిల్లా నోడల్ అధికారిగా ఐఏఎస్ అధికారి ఎం.రఘునందనరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నోడల్ అధికారిగా నియమితులైన రఘునందన్‌రావు ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రజాపాలన గ్రామసభలు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించడంతో, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు గాను ఉమ్మడి జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు ఇవ్వనున్నారు.
Updated Date - Dec 28 , 2023 | 01:01 AM