ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘జీరో’పై నజర్‌!

ABN, Publish Date - Dec 28 , 2023 | 03:42 PM

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు చూపి ఉచితంగా ప్రయాణిస్తుండడంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది.

  • ‘ఉచితం’తో పెరిగిన ఓఆర్‌

  • ఆర్టీసీకి రూ.20 కోట్ల ఆదాయం

  • పలు డిపోల్లో 100 శాతానికి పెరిగిన ఆక్యుపెన్సీ

  • ప్రయాణికుల సంఖ్య కంటే అధికంగా టికెట్లు

  • కండక్టర్లపై అనుమానాలతో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు చూపి ఉచితంగా ప్రయాణిస్తుండడంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. గతంలో 69 శాతం ఉంటే ఇపుడు మరో 20 శాతం పెరిగింది. ఈ టికెట్ల ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్టీసీ సంస్థకు రీయింబర్స్‌ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో సగటున రోజూ 30 లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుజురాబాద్‌, మేడ్చల్‌, ముషీరాబాద్‌, మియాపూర్‌-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోల్లో 100 శాతం ఓఆర్‌ నమోదైంది. జీరో టికెట్లతో ఆర్టీసీ ఆదాయం రూ.20 కోట్లకు చేరింది. గతంలో సాధారణ రోజుల్లో రూ.17-18 కోట్ల ఆదాయం వస్తుండగా జీరో టికెట్లతో మహిళల ప్రయాణాలు పెరగడంతో ఆదాయం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అదెలాగంటే జీరో టికెట్ల ప్రకారం ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ వస్తోందని చెబుతున్నారు. పలు జిల్లాలతోపాటు గ్రేటర్‌లో రద్దీ రూట్లలో మహిళా స్పెషల్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్న నేపఽథ్యంలో ఆ దిశగా కూడా ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఓ అధికారి తెలిపారు.

వారి చర్యలతో అసలుకే మోసం

కొందరు కండక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగినట్లు చూపేందుకు మహిళా ప్రయాణికుల సంఖ్యకు మించి జీరో టికెట్లు జారీ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తమయ్యారు. జీరో టికెట్ల జారీపై జిల్లా, సిటీ బస్సుల్లో రీజియన్ల వారీగా అధికారులు తనిఖీలు చేపట్టాలని, అవసరమైతే బస్‌ భవన్‌ అధికారులను కూడా తనిఖీల్లో భాగస్వాములను చేయాలంటూ ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేశారు. జీరో టికెట్లపై తప్పుడు లెక్కలు చూపినా, టికెట్ల జారీలో నిర్లక్ష్యం వహించినా సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

‘పల్లె వెలుగు’లో ప్రయాణం

పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణ ం ఉచితం అయినందున మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణాలు సాగిస్తున్నారు. తమ గ్రామం, పట్టణంలో ఆ బస్సులకు స్టాప్‌లు లేకున్నా ఆపమంటూ డ్రైవర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇతర ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉచితంగా ప్రయాణించే మహిళల వల్ల తమ ప్రయాణ సమయం పెరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. జిల్లాల్లో తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే వెళ్లాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు.

స్టాపుల్లో ఆగని బస్సులు

‘మహాలక్ష్మి’తో గ్రేటర్‌ సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ రెట్టింపైంది. ఉచిత ప్రయాణానికి ముందు రోజూ ఆరు లక్షలమంది ప్రయాణాలు సాగిస్తే ఇపుడు మరో రెండు లక్షలకు పైగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా వుండగా ఉచిత ప్రయాణాలు ప్రారంభించినప్పటి నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బస్‌ స్టాపుల్లో బస్సులు ఆగకుండా దూసుకుపోతున్నాయంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎంత రద్దీ ఉన్నా చెయ్యెత్తితే బస్సులను ఆపేవారని, ఇపుడు ఉచిత ప్రయాణంతో స్టాపుల్లో ప్రయాణికులున్నా ఆపకుండా వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి 200 కొత్త డీజిల్‌ బస్సులు

పెరిగిన రద్దీ నేపఽథ్యంలో కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది. సంక్రాంతికి 200 డీజిల్‌ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తుండగా ఈనెల 31 నాటికి 50 బస్సులు ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందిది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఐదు నెలల్లో రెండు వేల కొత్త బస్సులను రోడ్లపైకి తెచ్చేందుకు టీఎస్‌ ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌ జోన్‌లో 340 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. గ్రేటర్‌లో మొత్తం 2,800 బస్సులుండగా వాటిలో 2,600 రోడ్లపైకి వస్తున్నాయి. ఆరు నెలల్లో గ్రేటర్‌లో బస్సుల సంఖ్య 3,500 పెంచుకునే దిశగా అధికారులు ముందుకెళ్తున్నారు.

చిల్లర సమస్యలు

మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పులు తెస్తోంది. ఈ పథకం కారణంగా సంస్థకు గతంలో వచ్చినదానికంటే ఆదాయం కొంత తగ్గింది. ఈ క్రమంలో పురుష ప్రయాణికులు టికెట్ల కోసం రూ.500, రూ.200 నోట్లు ఇస్తున్నారు. దీంతో చిల్లర చెల్లింపు సమస్యలు తలెత్తుతున్నాయి. అసలే కలెక్షన్లు తగ్గిపోతే పెద్ద నోట్లు ఇచ్చిన వారికి చిల్లర ఎలా ఇవ్వగలం అంటూ కండక్టర్లు అసహనం వ్యక్తం చేస్తున్న సంఘటనలూ ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది.

ఫిర్యాదు చేస్తే చర్యలు

రద్దీ సమయాల్లో ప్రయాణికులు సమయనం పాటించి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగినా ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 03:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising