ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముచ్చటగా మూడో ఫేజ్‌!

ABN, Publish Date - Dec 26 , 2023 | 03:32 PM

ఎంఎంటీఎ్‌స(మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) హైదరాబాద్‌ వాసులకు మరింత చేరువకానుంది.

  • ఎంఎంటీఎస్‌ విస్తరణపై రైల్వే అధికారుల దృష్టి

  • ఎయిర్‌పోర్టు కనెక్టివిటీపై ప్రత్యేక కసరత్తు

  • ఫిబ్రవరి నాటికి పూర్తికానున్న రెండో దశ పనులు

  • దీంతో 90 కి.మీకు విస్తరించిన సేవలు

  • మూడో దశ చేపడితే ప్రయాణికులకు మరింత మేలు

  • నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి వేడుకోలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎంఎంటీఎ్‌స(మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) హైదరాబాద్‌ వాసులకు మరింత చేరువకానుంది. తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించగలిగే రవాణా సాధనం ఇది. అతితక్కువ కాలంలోనే ప్రయాణికుల ఆదరణను చూరగొనగా మొదటి దశతో రోజుకు రెండున్నర లక్షల మంది ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీంతో రెండో దశ ప్రాజెక్టును చేపట్టారు. కానీ నిధులు రాక పనులను పూర్తి కావడంలో జాప్యం జరిగింది. కాగా, ప్రస్తుతం రెండో దశ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి కానుండటంతో మూడో దశ పనులపైనా దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

త్వరలో అందుబాటులోకి ‘చర్లపల్లి’ స్టేషన్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరణకు నోచుకుంటున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌ మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. మౌలాలి- చర్లపల్లి మధ్య నాలుగు, సికింద్రాబాద్‌- మౌలాలి మధ్య రెండు లైన్ల ట్రాక్‌ నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. దీంతో సికింద్రాబాద్‌, బేగంపేట్‌, కాచిగూడ, లింగంపల్లి తదితర స్టేషన్లకు ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణికులు సులభంగా చేరుకునేందుకు అవకాశం ఉండనుంది.

ఉమ్దానగర్‌ టు విమానాశ్రయం

మూడో దశ ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టులో భాగంగా ఉమ్దానగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ సర్వీసులను పొడిగించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండో దశలో భాగంగా ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ నుంచి ఉమ్దానగర్‌ స్టేషన్‌ వరకు ఎంఎంటీఎ్‌సను విస్తరించారు. మూడో దశలో ఉమ్దానగర్‌ నుంచి శంషాబాద్‌కు విస్తరణ ప్రాజెక్టు అధికారుల పరిశీలనలో ఉంది. ఇదే జరిగితే గ్రేటర్‌ వాసులకు శంషాబాద్‌ వరకు చవకైన, త్వరగా గమ్యం చేరుకోగలిగే ప్రయాణం అందుబాటులోకి రానుంది. శంషాబాద్‌ విమానాశ్రయం అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తే సుమారు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరిస్తే లక్షలాది మంది ఉద్యోగులకు వ్యాపారులకు, విదేశీ ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది. ఈలోగా ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు ఉమ్దానగర్‌ నుంచి సులభంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా క్యాబ్‌ నిర్వాహకులతో రైల్వే అధికారులు సంప్రదింపులు చేస్తుండడం మరో విశేషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నందున కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వీలైనంత త్వరగా రెండోదశ ప్రాజెక్టు పనులకు పెండింగ్‌ నిధులు మంజూరు చేయాలని, అలాగే మూడో దశ ప్రాజెక్టు పనులకు ఆమోదం తెలపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరింత విస్తరించనున్న సేవలు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 90 కి.మీ మేర ఎంఎంటీఎస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొదటి దశలో 48 కి.మీ (లింగంపల్లి- హైదరాబాద్‌- ఫలక్‌నుమా మార్గాల్లో) ఉండగా, రెండో దశ విస్తరణతో మరిన్ని ప్రాంతాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గతంలో ఉన్న రైళ్లకు అదనంగా మరికొన్ని తోడవడంతో సర్వీసుల సంఖ్య 106కి చేరుకుంది. కొత్తగా సికింద్రాబాద్‌ - మేడ్చల్‌ మధ్య 20 సర్వీసులను ప్రవేశపెట్టడంతో మల్కాజిగిరి, దయానంద్‌ నగర్‌, సఫిల్‌గూడ, రామకిష్టాపురం, అమ్ముగూడ, కావల్రీ బ్యారక్స్‌, అల్వాల్‌ బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్‌ల సమీప ప్రాంతాల ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. కాగా, ఫలక్‌నుమా నుంచి మరో 20 సర్వీసులను ఉమ్దానగర్‌ వరకు పొడిగించారు. ఈ స్టేషన్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంగా ఉండడంతో విమానాశ్రయానికి వెళ్లాలనుకునే సబర్బన్‌ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లో కనీస టికెట్‌ ధర రూ.5 ఉండగా, గరిష్ట చార్జీ, రూ.15 మాత్రమే. రెండో దశలో పెండింగ్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో త్వరలోనే ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటలోకి రానున్నాయి.

Updated Date - Dec 26 , 2023 | 03:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising