NRI: కెనడాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్‌ల కలకలం.. ప్రజలను అలర్ట్ చేసిన ప్రభుత్వం..
ABN, First Publish Date - 2023-01-01T20:44:39+05:30
కెనడాలో వివిధ గ్యాంగ్‌ల మధ్య పోరాటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. పలు హింసాత్మక ఘటనలతో సంబంధమున్న ఇద్దరు భారత సంతతి యువకులతో ప్రజాభద్రతకు ముప్పు పొంచి ఉందని కెనడా పోలీసు శాఖ సర్రీ ప్రాంత విభాగం అధికారులు శుక్రవారం హెచ్చరించారు.
ఎన్నారై డెస్క్: కెనడాలో(Canada) వివిధ గ్యాంగ్‌ల మధ్య పోరాటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. పలు హింసాత్మక ఘటనలతో సంబంధమున్న ఇద్దరు భారత సంతతి యువకులతో ప్రజాభద్రతకు(Public Safety) ముప్పు పొంచి ఉందని కెనడా పోలీసు శాఖ సర్రీ(Surrey) ప్రాంత విభాగం అధికారులు శుక్రవారం హెచ్చరించారు. నిందితులను బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌కు చెందిన కరణ్‌వీర్ ఘర్చా(24), హర్‌కిరత్ ఝుట్టీ(22)గా గుర్తించారు. ఇద్దరి భద్రతకు ముప్పు పొంచి ఉన్న విషయాన్ని పోలీసులు తెలియజేశారు. అంతేకాకుండా.. వారికి సన్నిహితంగా ఉన్న వారికీ ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సర్రీ ప్రాంత ప్రజలను అలర్ట్(Alert) చేశారు. ‘‘గ్యాంగ్‌ల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం, డ్రగ్స్ పంపిణీ, కాల్పుల వంటి హింసాత్మక ఘటనలతో సంబంధమున్న ఆ ఇద్దరూ ముప్పును కొని తెచ్చుకున్నారు. తమ సన్నిహితులు, చుట్టుపక్కల వారినీ ప్రమాదంలోకి నెట్టారు.’’ అని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా ఈ యువకులు తమ తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు.
గతేడాది బ్రిటీష్ కొలంబియాలో గ్యాంగ్‌ల కారణంగా హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లాయి. పలు ఘటనల్లో భారత సంతతికి చెందిన వ్యక్తుల పాత్ర ఉన్నట్టు బయటపడింది. గ్యాంగ్‌లతో సంబంధాలున్న 11 మందితో ప్రజాభద్రతకు ముప్పు ఉందంటూ పోలీసులు గతేడాది ఆగస్టులో ఓ జాబితా విడుదల చేశారు. వీరిలో తొమ్మిది మంది పంజాబీ మూలాలున్న వారే కావడం గమనార్హం. కాగా.. కెనడాలో కొన్ని గ్యాంగ్‌ల కార్యకలాపాలు దేశసరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని భారత ప్రభుత్వం కెనడాను గతంలోనే అప్రమత్తం చేసింది. కెనడాలో ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురు గ్యాంగ్ లీడర్ల వివరాలను ఇరు దేశాల పోలీసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఖలిస్థానీ అనుకూల వర్గాలతో ఈ ఏడుగురు సన్నిహితంగా మెలుగుతున్నారంటూ భారత్ అప్పట్లో కెనడాను అప్రమత్తం చేసింది.
Updated Date - 2023-01-01T20:59:00+05:30 IST