Bengal Panchayat polls: అవన్నీ దుష్ప్రచారాలే, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం: మమత
ABN, First Publish Date - 2023-06-16T19:38:17+05:30
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఒకటి, రెండు చెదురుమదురు సంఘటనలను దృష్టిలో ఉంచుకుని విపక్షాలు రాద్ధాంతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని తప్పుపట్టారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలకు (West Bengal panchayat poll) నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) చెప్పారు. ఒకటి, రెండు చెదురుమదురు సంఘటనలను దృష్టిలో ఉంచుకుని విపక్షాలు రాద్ధాంతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని తప్పుపట్టారు. నామినేషన్ల చివరిరోజు చోటుచేసుకున్న ఘర్షణల్లో ముగ్గురు మరణించడం, భాంగోరెలో శుక్రవారం పర్యటించిన గవర్నర్ సీవీ ఆనంద్ రాష్ట్రంలో రాజకీయ హింసకు తెరపడాలంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మమత తాజా వ్యాఖ్యలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ రెండు నెలలుగా చేపట్టిన ''న్యూ వేవ్ ఇన్ తృణమూల్'' ప్రచారం ముగింపు కార్యక్రమం సందర్భంగా సౌత్ 24 పరగణాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఏ ఇతర రాష్ట్రాల్లోనూ జరగనంత ప్రశాంతంగా జరిగినట్టు చెప్పారు. నామినేషన్ల సమయంలో జరిగిన ఒకటి, రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని విపక్ష సీపీఎం, కాంగ్రెస్ , బీజేపీ, ఐఎస్ఎఫ్‌లు ఆరోపణలకు దిగుతున్నాయని అన్నారు.
''బెంగాల్‌లో శాంతి లేదని ఈరోజు చెబుతున్న వాళ్లని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. సీపీఎం హయాంలో ఎలా ఉంటేది? కాంగ్రెస్ కూడా పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వాళ్లు పార్లమెంటులో మా మద్దతు కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా వారికి మద్దతిచ్చేందుకు మేము రెడీగా ఉన్నాం. కానీ వాళ్లు బెంగాల్‌లో మాకు మద్దతిచ్చేందుకు ముందుకు రాలేదు. సీపీఎంతో చేతులు కలిపారు'' అని మమతా బెనర్జీ విమర్శించారు.
2.31 లక్షల నామినేషన్లు దాఖలు
పంచాయతీ ఎన్నికల్లో గురువారం వరకూ 2.31 లక్షల నామినేషన్లు దాఖలు అయ్యాయని, వీటిలో 82,000 నామినేషన్లు టీఎంసీకి చెందినవని అన్నారు. ఇతర పార్టీలు 1-1.5 లక్షల నామినేషన్లు వేశాయని చెప్పారు. బీజేపీలో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది దొంగలు, గూండాలేనని ఆరోపించారు.
Updated Date - 2023-06-16T19:38:17+05:30 IST