Modi: ఉచిత హామీలతో మోసపోవద్దు...
ABN, First Publish Date - 2023-07-01T21:13:11+05:30
కుటుంబ పార్టీలు ఇచ్చే బూటకపు హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని షహడోల్‌లో శనివారంనాడు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, కేంద్రంలోని గత ప్రభుత్వాలు పేదలు, అణగారిన వర్గాల పట్ల ఉదాసీనత ప్రదర్శించారని ఆరోపించారు.
షహడోల్: కుటుంబ పార్టీలు (Family centric parties) ఇచ్చే బూటకపు హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. మధ్యప్రదేశ్‌లోని షహడోల్‌లో శనివారంనాడు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, కేంద్రంలోని గత ప్రభుత్వాలు పేదలు, అణగారిన వర్గాల పట్ల ఉదాసీనత ప్రదర్శించారని ఆరోపించారు. 70 ఏళ్లుగా ప్రభుత్వాలు పేదలకు కేవలం ఆహారం మాత్రమే టేబుల్‌పై ఉంచాయని, ప్రస్తుత ప్రభుత్వం (కేంద్రం) గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల కుటుంబాలకు ఉచిత ఆహారధాన్యాల గ్యారెంటీ కల్పించిందని చెప్పారు.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ హామీలు ఇవ్వడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, ఉచితంగా ఇవ్వడమంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టుగా గ్రహించాలన్నారు. ప్రజారవాణా సంస్థల్లో ఉచిత ప్రయాణాలకు హామీ ఇవ్వడం వల్ల రవాణా వ్యవస్థ ఎక్కువ కాలం స్వయంసమృద్ధితో మనజాలదని గ్రహించాలని అన్నారు. అది రవాణా వ్యవస్థ కుప్పకూలడానికి దారితీస్తుందని చెప్పారు. పెన్షన్లు పెంచుతామనే హామీలు ఇవ్వడాన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని చెప్పడంగా గ్రహించాలన్నారు. ఆయా రాష్ట్రాలు ఉద్యోగాలిస్తామనే హామీలతో కొత్తగా ప్రవేశపెట్టే విధానాల వల్ల ఆ రాష్ట్రాల్లో పరిశ్రమల మనుగడు ప్రమాదంలో పడుతోందన్నారు. తమ రాజకీయ భవిష్యత్తుగా గ్యారెంటీ లేదని తెలిసి కూడా ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇస్తూ పోతున్నారని, కొత్త కొత్త హామీలపై ప్రజల ముందుకు వస్తున్నారని మోదీ హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని, ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య భద్రత కల్పించిందని, ఉజ్వల యోజన కింద 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందిని, ముద్ర యోజన ద్వారా లబ్ధిదారులకు రూ.8.5 కోట్ల రుణాలు ఇచ్చిందని చెప్పారు. కాగా, మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో నేషనల్ సికెల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రారంభించారు. 3.57 కోట్ల ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కార్డులు పంపిణీ చేశారు.
Updated Date - 2023-07-01T21:13:11+05:30 IST