Modi: న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీబీఐ.. డైమండ్ జూబ్లీ వేడుకల్లో మోదీ
ABN, First Publish Date - 2023-04-03T15:27:26+05:30
కేంద్ర దర్యాప్తు సంస్థ సత్యం, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సత్యం, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. 1963లో ఏర్పాటైన సీబీఐ తన పనితీరు, సామర్థ్యంతో సామాన్య ప్రజానీకం నమ్మకాన్ని సైతం చూరగొందని అన్నారు. ఏదైనా కేసు పరిష్కారం కోసం సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉందని అన్నారు. సోమవారంనాడిక్కడ జరిగిన సీబీఐ డైమండ్ జూబ్లీ (CBI Diamaond Jubilee Celerabations) వేడుకల కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, వృత్తిపరమైన నిబద్ధత, సమర్ధత కలిగిన సీబీఐ వంటి సంస్థలు లేకుండా అభివృద్ధి భారతాన్ని నిర్మించడం సాధం కాదని, ఈ దిశగా సీబీఐపై అతిపెద్ద బాధ్యత ఉందని అన్నారు.
''మీరు (సీబీఐ) ఎవరి మీద చర్యలు తీసుకున్నారో వారి గురించి మాట్లాడుతున్న వ్యక్తులు చాలా శక్తివంతులు. వాళ్లు ప్రభుత్వంలో, వ్యవస్థలో ఏళ్ల తరబడి ఉన్నారు. ఈరోజుకు కూడా వాళ్లు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ మీరు (సీబీఐ) మీ పని మీదే దృష్టి ఉంచండి. అవినీతిపరులైన ఏ ఒక్కరినీ వదలకండి'' అని సీబీఐకి మోదీ దిశానిర్దేశం చేశారు. సీబీఐ వంటి సమర్ధవంతమైన సంస్థలు, వృత్తినిపుణులు లేకుండా దేశం ముందుకు వెళ్లలేదని, బ్యాంకు మోసాల నుంచి వణ్యప్రాణుల సంబంధిత మోసాల వరకూ సీబీఐ పని అనేక రెట్లు పెరుగుతూనే ఉందని, అయితే అవినీతి రహిత భారతదేశాన్ని రూపొందించడమే సీబీఐ ప్రధాన బాధ్యత అని అన్నారు.
పదేళ్ల క్రితం, ఎంత పెద్ద అవినీతి చేస్తే అంత గొప్ప అన్నంతగా పోటాపోటీ ఉండేదని, ఆ సమయంలో చాలా పెద్ద కుంభకోణాలు వెలలుగు చూశాయని, అయితే వ్యవస్థ తమకు దన్నుగా ఉందనే కారణంగా నిందితులు భయపడేవారు కాదని మోదీ అన్నారు. 2014 తర్వాత తాము అవినీతి, నల్లధనం వెలికితీతపై యుద్ధప్రాతిపదికపై పనిచేశామని చెప్పారు. ''సీబీఐ అధికారులు సమర్ధవంతంగా పనిచేయండి. ఎంతటి శక్తివంతులైన వ్యక్తులకైనా బెదరవలసిన పని లేదు'' అని మోదీ సూచించారు. ప్రజాస్వామ్యం, న్యాయానికి అవినీతి పెద్ద అవరోధమని, అవినీతి ముక్త భారతంలో సీబీఐ పాత్ర కీలకమని అన్నారు. అవినీతిపై పోరాటానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అవినీతిని సహించరాదనేది ప్రభుత్వం, ప్రజల కోరక అని ఆయన చెప్పారు. పేద ప్రజల హక్కులను అవినీతి ఊడలాక్కుంటుందని, అనేక మంది నేరగాళ్లుగా మారడానికి దారితీస్తుందని చెప్పారు. బ్లాక్ మనీ, బినామీ ఆస్తులపై తమ ప్రభుత్వం కొరడా ఝళిపించిందని, అవినీతికి దారితీసే పరిస్థితులపైనా పోరాడుతోందని అన్నారు.
Updated Date - 2023-04-03T15:30:18+05:30 IST