I.N.D.I.A Logo: లోగో విడుదల వాయిదా...కారణం ఏమిటంటే?
ABN, First Publish Date - 2023-09-01T19:42:36+05:30
విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల సమావేశంలో 'లోగో' విడుదల వాయిదా పడింది. కొన్ని కీలక నిర్ణయాలు సమావేశంలో తీసుకోగా, లోగో కలర్, డిజైన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వాయిదా పడింది. శుక్రవారంనాడు ఈ విషయాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ కూడా ధ్రువీకరించారు.
ముంబై: విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమి రెండ్రోజుల సమావేశంలో 'లోగో' విడుదల (Logo uveiling) వాయిదా (postponement) పడింది. కొన్ని కీలక నిర్ణయాలు సమావేశంలో తీసుకోగా, లోగో కలర్, డిజైన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వాయిదా పడింది. శుక్రవారంనాడు ఈ విషయాన్ని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ కూడా ధ్రువీకరించారు. 'ఇండియా' కూటమికి 'లోగో' చాలా ముఖ్యమైనదని, దీని గురించి ఇవాళ చర్చిస్తామని, ఆవిష్కరణ మాత్రం ఈరోజు ఉండదని చెప్పారు.
కాగా, తొలుత ఒక లోగోను అనుకున్నప్పటికీ 'IN' పదంలో కేసరియ రంగు ఉండటం, 'D' పదంపై ఆకుపచ్చు రంగుపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో భారదేశం మ్యాప్ ఉండాలని మరి కొందరు నేతలు సూచించారు. ఈ చర్చలు ముగిసిన తర్వాతే లోగో ఆవిష్కరణ ఉంటుందని తెలుస్తోంది.
కీలక నిర్ణయాలివే...
'ఇండియా' కూటమి ముంబై సమావేశాల్లో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని సమావేశం ఏర్పాటు చేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది. సమన్వయ కమిటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన-యూబీటీ నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ ఖాన్, జేడీయూ నేత లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, సీపీఐ నేత డీ రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. కమిటీకి కన్వీనర్‌ను మాత్రం ప్రకటించలేదు.
నెలాఖరులోగా సీట్ల పంపకాలు పూర్తి..
లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు. సీట్ల పంపకాలను ఇచ్చి, పుచ్చుకునే పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా, ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా’ నినాదంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. భాగస్వామ్య పార్టీల కమ్యూనికేషన్స్, మీడియా స్ట్రాటజీలను సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రచార కార్యక్రమాలను స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్ 2 నాటికి మేనిఫెస్టో సిద్ధం చేయాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశంలో కోరారు.
Updated Date - 2023-09-01T19:44:15+05:30 IST