Gas Agency: రూ.5వేలు అనగానే పరుగో పరుగు.. గ్యాస్ ఏజెన్సీ వద్దకు పోటెత్తిన మహిళలు
ABN, Publish Date - Dec 24 , 2023 | 10:52 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రతి మహిళకు రూ.5వేలు మంజూరు చేశారనే ప్రచారంతో హుబ్బళ్లిలోని ఓ గ్యాస్ ఏజెన్సీ(Gas Agency) వద్దకు వేలాది మంది తరలివచ్చారు.
- గ్యాస్ కేవైసీ చేయించుకోని వినియోగదారులు
- ప్రధాని మోదీ రూ.5వేలు మంజూరు చేశారని ప్రచారం
- హుబ్బళ్లిలో గ్యాస్ ఏజెన్సీ వద్దకు పోటెత్తిన మహిళలు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రతి మహిళకు రూ.5వేలు మంజూరు చేశారనే ప్రచారంతో హుబ్బళ్లిలోని ఓ గ్యాస్ ఏజెన్సీ(Gas Agency) వద్దకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్ర పెట్రోలియం శాఖ ద్వారా వినియోగదారులు కేవైసీ చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. రెండుమూడు వారాలుగా ప్రతి వంటగ్యాస్ వినియోగదారుడు తప్పనిసరిగా కేవైసీ వివరాలను పొందుపరచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు అంతగా ఆసక్తి చూపలేదు. ప్రతి వంటగ్యాస్ వినియోగదారుడికి ప్రధానమంత్రి నరేంద్రమో రూ.5 వేలు మంజూరు చేశారనే ప్రచారం సాగింది. దీంతో ఒక్కసారిగా శనివారం హుబ్బళ్లి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్దఎత్తున కలఘటగిలోని లోకపూజ్య వంటగ్యాస్ ఏజెన్సీ వద్దకు తరలివచ్చారు. ఎవరికీ రూ.5వేలు నగదు చెల్లింపులు జరగక పోవడంతో మహిళలు మండిపడ్డారు. ఇంతకూ రూ.5వేలు చెల్లిస్తారని చెప్పినవారు ఎవరనేది రహస్యంగా మారింది. గంటలతరబడి వేచి చూసిన మహిళలు ఇదంతా బోగస్ అని తేలిపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. కాగా కలబురగిలోను ఇటువంటి ప్రచారమే సాగింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రతిచోటా వంటగ్యాస్ సిలెండర్ ధరలు తగ్గిస్తారని, అందుకు కేవైసీ తప్పనిసరి అని జనవరి నుంచే కొత్త స్కీం సిలెండర్లు వస్తాయనే ప్రచారం చేశారు. హుబ్బళ్లి తరహాలోనే కలబురిగిలోను మహిళలు పెద్దఎత్తున గ్యాస్ ఏజెన్సీల వద్దకు చేరారు. వంటగ్యాస్ ఏజెన్సీలు కేవైసీ ప్రక్రియను సులభతరంగా పూర్తి చేసుకోవచ్చునని ఇటువంటి వదంతులు పుట్టించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Dec 24 , 2023 | 10:52 AM