Chennai: ‘సింగార చెన్నై 2.0’ ప్రాజెక్టులో మార్పులు
ABN, Publish Date - Dec 15 , 2023 | 12:33 PM
చెన్నై నగరం సుందరీకరణ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సింగార చెన్నై 2.0’ ప్రాజెక్టులో అనేక మార్పులు చేర్పులు
అడయార్(చెన్నై): చెన్నై నగరం సుందరీకరణ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సింగార చెన్నై 2.0’ ప్రాజెక్టులో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ నెల 4న సంభవించిన తుఫాను కారణంగా ఇప్పటికీ అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. దీంతో సింగార చెన్నై 2.0 ప్రాజెక్టులో మార్పులు చేయాలని చెన్నై కార్పొరేషన్(Chennai Corporation)తో పాటు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల విషయంలో అనేక మార్పులు చేసి, ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జీసీసీ పరిధిలో పార్కుల నిర్మాణం చేపట్టనున్నారు. బీచ్‌ల చుట్టూ నగరాన్ని విస్తరించనున్నారు. నగర వైశాల్యాన్ని 5,904 చదరపు కిలోమీటర్ల మేరకు పెంచనున్నారు. అలాగే, చెన్నైకు దీటుగా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరులను అనుబంధ నగరాలుగా తీర్చిదిద్దనున్నారు. తుఫాను కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునగగా ఈ వరద నీటిని కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. కానీ, 363 ప్రాంతాల్లో మాత్రం ఈ నీటిని తొలగించలేకపోతున్నారు. ఈ ప్రాంతాలను చెన్నై కార్పొరేషన్ అధికారులు బుధవారం పరిశీలించారు. ఇదే విషయంపై చెన్నై కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ... వరద నీరు రెండు కంటే ఎక్కువ రోజులు నిల్వవున్న 363 ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. వర్షపు నీరు నిలబడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.
Updated Date - Dec 15 , 2023 | 12:33 PM