Aziz Qureshi: 'జై గంగా మయ్య' నినాదం సిగ్గుచేటు.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-22T21:19:24+05:30
కాంగ్రెస్ సీనియర్ నేత అజిజ్ ఖురేషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు 'జై గంగా మయ్య', 'జై నర్మదా మయ్య' అంటూ నినాదాలు చేయడం ఎంతో సిగ్గుచేటని, కొందరు నేతలు రెలిజియస్ టూర్లు తీస్తూ, హిందువులుగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నామంటూ మాట్లాడుతున్నారని అన్నారు.
విదిష: కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత అజిజ్ ఖురేషి (Aziz Qureshi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనను తొలగించినా భయపడేది లేదంటూ ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ నేతలు 'జై గంగా మయ్య', 'జై నర్మదా మయ్య' అంటూ నినాదాలు చేయడం ఎంతో సిగ్గుచేటని, కొందరు పార్టీ నేతలు రెలిజియస్ టూర్లు తీస్తూ, హిందువులుగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నామంటూ మాట్లాడుతున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
''22 కోట్ల ముస్లిం జనాభాలో ఒకటి రెండు కోట్లు పోతే పెద్ద విషయం కాదు. నీళ్లు కట్ట దాటి మునిగిపోయే పరిస్థితి వస్తే ముస్లింలు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకోరు'' అని ఖురేషి అన్నారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తూ, పార్టీ కార్యాలయాల్లో హిందూ దేవతల విగ్రహాలను ఉంచుతున్నారని, కొందరైతే హిందుత్వ ర్యాలీలు తీస్తున్నారని, జై గంగా మయ్య, జై నర్మద మయ్య అంటూ నినాదాలిస్తున్నారని, ఇంతకంటే సిగ్గుచేటైన వ్యవహారం ఏమిటని నిలదీశారు. ఆయన మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను బీజేపీ ప్రతినిధి పంకజ్ చతుర్వేది సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
నాకే భయం లేదు..
కాగా, తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఖురేషి చెప్పారు. పార్టీ నుంచి తనను తొలగించవచ్చనే భయాలు లేవన్నారు. ''పార్టీ నుంచి తొలగిస్తే తొలగించండి. భయపడను. ఇవాళ నెహ్రూ వారసులు, కాంగ్రెస్ వ్యక్తులు మతపరమైన ఊరేగింపులు తీస్తున్నారు. జై గంగా మయ్య అంటూ, తాము హిందువులమని ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ విగ్రహాలు పెడుతున్నారు'' అని అన్నారు.
ఎవరీ ఖురేషి?
ఖురేషి మిజోరం 15వ గవర్నర్‌గా 2015 మార్చిలో పనిచేశారు. 2012 నుంచి 2015 వరకూ ఉత్తరాఖండ్ గవర్నర్‌గా సేవలందించారు. 2014లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2020లో ఆయనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమించింది. 1973లో మధ్యప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. 1984లో సత్నా (మధ్యప్రదేశ్) నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1989 వరకూ ఎంపీగా కొనసాగారు.
Updated Date - 2023-08-22T21:19:24+05:30 IST