Assembly elections: 20న రాష్ట్రానికి రాహుల్.. బెళగావి నుంచి ప్రచారం
ABN, First Publish Date - 2023-03-17T13:29:12+05:30
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ మరో పదిరోజుల తర్వాత వస్తుందనే సంకేతాల నేపథ్యంలోనే రాష్ట్రానికి అగ్రనేతల యాత్రలు పె
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ మరో పదిరోజుల తర్వాత వస్తుందనే సంకేతాల నేపథ్యంలోనే రాష్ట్రానికి అగ్రనేతల యాత్రలు పెరగనున్నాయి. దాదాపు రెండునెలల కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంలోని పలు జిల్లాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారాలు చేశారు. ఇంతకాలం ముందస్తు కార్యక్రమాలతో బిజీగా గడిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక రాష్ట్ర పర్యటనలకు సిద్దమయ్యారు. రాహుల్ యాత్రలను జోరుగా సాగించే దిశగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్‌గాంధీ ఈనెల 20న సోమవారం బెళగావి(Belagavi)లో ఎన్నికల ప్రచారాలకు శ్రీకారం చుట్టనున్నారు. శాసనసభ ఎన్నికల వేళ రాహుల్‌గాంధీ(Rahul Gandhi) పాల్గొనే తొలి సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బెళగావి, బాగల్‌కోటె, ఉత్తరకన్నడ జిల్లాలతో పాటు అనుబంధ జిల్లాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరుపున రాష్ట్ర నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు ప్రజాధ్వని యాత్రలు చేపట్టారు. తొలి విడతలో ఇద్దరూ కలిసి చేయగా రెండో విడతలో సిద్దరామయ్య ఉత్తరకర్ణాటకలోను, డీకే శివకుమార్ దక్షిణ కర్ణాటక ప్రాంతాలలోను, తీర జిల్లాల్లో బీకే హరిప్రసాద్‌లు ముగించారు. మూడోవిడత యాత్రలకు షెడ్యూలు ఖరారైంది. ఇప్పటి దాకా సాగిన ప్రజాధ్వని యాత్రలు విజయవంతం అయ్యాయి. అంతకు ముందు రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర రాష్ట్రంలో జోరుగానే సాగింది. అదే ఉత్సాహంలోనే రాష్ట్ర నాయకులు ప్రజాధ్వని యాత్రలను బాగానే జరిపారు. రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్ర రాష్ట్రంలో 8 జిల్లాల పరిధిలో 25కు పైగా నియోజకవర్గాల వ్యాప్తంగా 350 కిలోమీటర్ల మేరన సాగింది. నాలుగు బహిరంగ సభలకు భారీగా జనం వచ్చిన విషయం తెలిసిందే. ఇక బెంగళూరులో పార్టీ మహిళా సదస్సుకు ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదే వేదికపైనా ప్రియాంక గాంధీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి గృహిణికి నెలకు రెండువేలు చెల్లించేలా ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలే తుమకూరు జిల్లా కొరటగెరె పార్టీ సభలో భాగస్వామ్యులయ్యారు. భారత్‌జోడో తర్వాత రాష్ట్రానికి తొలిసారి వస్తున్న రాహుల్ గాంధీ ఎన్నికల వేళ కనీసం రెండువారాలకు పైగా ఇక్కడే ఉంటూ జిల్లాల వారీగా పర్యటిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి షెడ్యూలు నెలాఖరు తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.
బెళగావిలో రాహుల్ సభ ఏర్పాట్లు
పర్యవేక్షించిన డీకే శివకుమార్
ఈనెల 20న సోమవారం రాహుల్‌గాంధీ బెళగావిలో పార్టీ ప్రచార సభలకు శ్రీకారం చుట్టనున్న తరుణంలోనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు డీకే శివకుమార్(DK Sivakumar) గురువారం పర్యవేక్షించారు. బెళగావి జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ బహిరంగసభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2023-03-17T13:29:12+05:30 IST