New Year: న్యూ ఇయర్ వేడుకల కోసం.. ఒడిస్సా నుంచి నగరానికి గంజాయి
ABN, Publish Date - Dec 31 , 2023 | 11:24 AM
న్యూ ఇయర్(New Year) వేడుకల నేపథ్యంలో ఒడిస్సా నుంచి నగరానికి గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, వారాసిగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు.
- ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): న్యూ ఇయర్(New Year) వేడుకల నేపథ్యంలో ఒడిస్సా నుంచి నగరానికి గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, వారాసిగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి 7.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన దేవర వంశీ కొంతకాలంగా ఒడిస్సా నుంచి గంజాయిని నగరానికి సరఫరా చేసి డబ్బులు సంపాదించేవాడు. ఈ క్రమంలో అతడికి ఒడిస్సాకు చెందిన గంజాయి సరఫరాదారులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా అనేక ప్రాంతాలకు గంజాయిని గుట్టుగా సప్లై చేసేవాడు. గతంలో రాయ్‌గఢ్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చినా పద్ధతి మార్చుకోలేదు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరానికి గంజాయి సరఫరా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఒడిస్సాకు చెందిన మానస్ రంజన్ లబాలా, చందన్‌కుమార్‌లతో కలిసి నగరానికి గంజాయిని సరఫరా చేశాడు. వారాసిగూడ ప్రాంతంలో శనివారం గంజాయి విక్రయించేందుకు వేచి చూస్తుండగా, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారాసిగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులూ..
ఇతర ప్రాంతాల నుంచి గుట్టుగా గంజాయి తెచ్చి సరూర్‌నగర్ ప్రాంతంలో విక్రయిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Dec 31 , 2023 | 11:24 AM