Duplicate certificates: నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:59 AM
స్థానిక విల్లివాక్కంలో నకిలీ సర్టిఫికెట్ల(Duplicate certificates) తయారీ ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి
ప్యారీస్(చెన్నై): స్థానిక విల్లివాక్కంలో నకిలీ సర్టిఫికెట్ల(Duplicate certificates) తయారీ ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి, 4 వేలకు పైగా ధృవీకరణ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, ముద్రణా పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు చెన్నై నగర పోలీసు కమిషనర్ సందీప్‌రాయ్ రాథోర్ చెప్పారు. తెలంగాణకు చెందిన సాయిరాంరెడ్డి నవంబరులో అమెరికా వెళ్లేందుకు వీసా కోసం స్థానిక థౌజండ్‌లైట్స్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని సంప్రదించారు. ఆయన సమర్పించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు నకిలీవని గుర్తించారు. దీనిపై దౌత్య కార్యాలయ భద్రతా విభాగం అధికారి మెల్విన్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు సాయిరాంరెడ్డి వద్ద జరిపిన విచారణలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో సంబంధాలున్నట్లు తెలియడంతో ఆంధ్రాకు చెందిన దివాకర్ (38), రిషికేష్ (40)ని అరెస్ట్ చేశారు. వారి సమాచారంతో విల్లివాక్కానికి చెందిన మహమ్మద్ రియాజ్ (40), మహేష్(38)ను అరెస్ట్ చేశారు. విచారణలో... 2020వ సంవత్సరం నుంచి ఇండియ న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ టెక్నాలజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ అనే ఆన్‌లైన్ విద్యా సంస్థ ప్రారంభించారు. అయితే అందులో ఎవరూ చేరకపోవడంతో మహమ్మద్ రియాజ్, మహేష్ నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి గత మూడేళ్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వేల మందికి విక్రయించినట్లు తెలిసింది.
Updated Date - Dec 17 , 2023 | 10:59 AM