YCP MLA: టీడీపీ కార్యకర్తలు తాగుబోతులంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-08T20:15:55+05:30
టీడీపీ నేతలు (TDP leaders), కార్యకర్తలపై నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు (Nuzividu YCP MLA Meka Venkata Pratap Appara) విమర్శలు గుప్పించారు.
ఏలూరు జిల్లా: టీడీపీ నేతలు (TDP leaders), కార్యకర్తలపై నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు (Nuzividu YCP MLA Meka Venkata Pratap Appara) విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై ప్రశ్నించే టీడీపీ కార్యకర్తలు తాగుబోతులంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు హాజరయ్యారు.
తమ గ్రామంలో రాకపోకలకు రహాదారి మార్గం గుంతల మయంగా వుందని, వైద్య సేవలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామస్థుల అభ్యర్థనలతో పాటుగా గ్రామ అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు, గ్రామస్తులు అభివృద్ధిపై నిలదీయడంతో మండల వైసీపీ నాయకులు వాగ్వావాదానికి దిగారు. సమస్యలపై ప్రశ్నించిన గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలను తాగుబోతులంటూ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
''అధికార పార్టీ సమావేశాలలో అభివృద్ధి ఏం చేశారనీ టీడీపీ కార్యకర్తలు అడ్డుపడి నిలదీస్తే, వారిని మా కార్యకర్తలు ఏం చేసినా నాకు సంభందం లేదు.'' అని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై సూరేపల్లి గ్రామ ప్రజలు, మండల టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకుని కడుపు నింపుకునే రైతులపై తాగుబోతులని ముద్ర వేసి, ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
Updated Date - 2023-07-08T20:22:09+05:30 IST